Vavilla Venkateswara Sastrulu
Quick Facts
Biography
వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి (1884 - 1956) పండితులు, భాషా పోషకులు, ప్రచురణ కర్త. వీరు సుప్రసిద్ధ వావిళ్ళ వారి వంశంలో వావిళ్ళ రామస్వామి శాస్త్రులు దంపతులకు జన్మించారు. వీరి తండ్రి స్థాపించిన వావిళ్ళ సంస్థను బాగా అభివృద్ధి చేశారు. ప్రాచీనాంధ్ర ప్రబంధాలను, శతకాలనే కాక నూతన గ్రంథాలను కూడా కొన్నింటిని ప్రకటించారు.
ఆంధ్ర గ్రంథ ముద్రణకు వీరు చేసిన సేవకు గాను ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ఇతనికి 1955లో కళాప్రపూర్ణ గౌరవంతో సన్మానించింది.
బాల్యము, విద్య , వివాహం
వెంకటేశ్వర శాస్త్రి వావిళ్ళ రామస్వామిశాస్త్రి, జ్ఞాంబ దంపతుల ప్రథమ సంతానం. చిన్నవయసులోనే తండ్రిని కోల్పోయిన శాస్త్రి తన మేనమామ వేదం వేంకటరాయ శస్త్రి, శ్రీ ఉడాలి దండిగుంట సూర్యనారాయణశాస్త్రుల వద్ద సంస్కృతాంధ్ర సాహిత్యాలలో పాండిత్యం సంపాదించారు. కర్నూలు మున్సిపల్ హైస్కూలులో కొన్నేళ్ళు చదివి, చెన్నపురి పచ్చయప్ప హైస్కూలులో మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణత పొంది అక్కడి కళాశాలలోనే ఎఫ్.ఏ దాకా చదివారు.
వెంకటేశ్వర శాస్త్రికి భువనపల్లి సీతారామయ్య గారి కుమార్తె సుబ్బమ్మతో పదిహేనేళ్ళ వయసులో వివాహం జరిగింది. ఆయన నిస్సంతుగా, వీలూనామా రాయకుండా మరణించడంతో ఆయన తదనంతరం వావిళ్ళ ప్రెస్సు మనుగడ ప్రమాదంలో పడింది. తరువాత చాలాకాలానికి అల్లాడి వారి కృషి ఫలితంగా మళ్ళీ విజయవంతంగా పనిచేసింది.
వావిళ్ళ ప్రెస్ నిర్వహణ
తన తండ్రి స్థాపించిన "ఆది సరస్వతీనిలయము" ప్రెస్సుకు 1906లో వావిళ్ళ ప్రెస్సు అన్న పేరు పెట్టి నిర్వహణ బాధ్యతలు స్వీకరించారు. కాలక్రమంలో బాలశిక్ష మొదలుకుని అన్ని రకాలైన పుస్తకాలను వందల సంఖ్యలో తెలుగు, సంస్కృత, తమిళ, ఆంగ్ల భాషల్లో ప్రచురించారు. "వావిళ్ళ వారి గ్రంథాలలో తప్పులుండవు" అనే కీర్తిని కూడా పొందారు.
"ఆనంద మఠం" గ్రంథానికి తెలుగు ముద్రణ, తిలక్ గీతారహస్యానికి మరాఠీ నుండి చేసిన తెలుగు అనువాదం వీరు ప్రచురించిన పుస్తకాల్లో కొన్ని. తెలుగులో "త్రిలింగ" వార పత్రికకు, ఆంగ్లంలో "ఫెడరేటెడ్ ఇండియా" మాసపత్రికకూ సంపాదకత్వం వహించారు.
మూలాలు
- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
- అధ్యాయం-10, తెలుగు జాతిరత్నాలు - వావిళ్ళ రామస్వామి శాస్త్రి , వజ్ఝల వేంకట సుబ్రహ్మణ్యశర్మ, సి.పి.బ్రౌన్ అకాడమీ ప్రచురణ, 2009.