Turlapati Radhakrishna Murthy
Quick Facts
Biography
తుర్లపాటి రాధాకృష్ణమూర్తి ప్రముఖ రంగస్థల నటుడు. ముఖ్యంగా దుర్యోధన పాత్రలో రాణించాడు.
విశేషాలు
ఇతడు ప్రకాశం జిల్లా, అద్దంకి మండలం, కలవకూరు గ్రామంలో 1938, జూలై 10వ తేదీన జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం చిననందిపాడు, పెదనందిపాడు, గుంటూరులలో సాగింది. తరువాత1962లో గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో తెలుగు ట్యూటరుగా చేరాడు. ఇతడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పద్యనాటక విభాగంలో శిక్షకుడిగా సేవలను అందించాడు.
నాటకరంగం
ఇతని ప్రాథమిక రంగస్థల గురువు సెనగపాటి వీరేశలింగం. ఇతడు తొలిసారి సహదేవుని పాత్రను రంగస్థలంపై ధరించాడు. ఇతడు యువనాటక సమాజంలో చేరి ద్రౌపది, అశత్థామ మొదలైన పాత్రలను ధరించాడు. కాలేజీ చదివే రోజులలో కాళిదాసు నాటకంలో కవిరాక్షస, భోజరాజ పాత్రలను వేశాడు. ఆ తరువాత ఉద్యోగవిజయాలు నాటకంలో ధర్మరాజు, కర్ణుడు పాత్రలను ధరించి పౌరాణిక నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే ధూళిపాళ సీతారామశాస్త్రి సినిమాలలో ప్రవేశించడం, ఆచంట వెంకటరత్నం నాయుడు విజయవాడలో స్థిరపడటంతో గుంటూరు నాటక సమాజంలో ధుర్యోధన పాత్రధారి కొరత ఏర్పడింది. లక్ష్మయ్యచౌదరి ట్రూపు ఇందుపల్లిలో వేసిన నాటకంలో దుర్యోధన పాత్రను తుర్లపాటి రాధాకృష్ణమూర్తికి ఇచ్చారు. ఆనాటి నుండి కల్యాణం రఘురామయ్య, పీసపాటి నరసింహమూర్తి, ఏ.వి.సుబ్బారావు, షణ్ముఖి ఆంజనేయ రాజు, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, ధూళిపాళ సీతారామశాస్త్రి, ఆచంట వెంకటరత్నం నాయుడు, కె.వి. రాఘవరావు, వెంకటనర్సు నాయుడు, రేబాల రమణ,చెంచు రామారావు, జై రాజు మొదలైన ప్రధాన నటుల సరసన కురుక్షేత్రం, రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం వంటి నాటకాలలో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందాడు. ఇతని నాటకాలు దూరదర్శన్‌లో, ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. భువన విజయం సాహిత్యరూపకాలలో భట్టుమూర్తి పాత్ర ధరించాడు.
సత్కారాలు
ఇతడు నటించిన పాత్రలు అనేక నాటక పోటీలలో ఇతనికి బహుమతిని తెచ్చిపెట్టాయి. అనేక సన్మానాలు, సత్కారాలు పొందాడు. చోడవరంలో, గుంటూరులో ఇతనికి ఘంటా కంకణ ప్రదానం జరిగింది.
రచనలు
- ఏకపాత్రల సమాహారం
- రంగస్థలి అనుభవాల తోరణాలు
- శ్రీ గుంటుపల్లి ఆంజనేయ చౌదరి గారి అభినందన సంచిక (సంపాదకత్వం)
- కళాతపస్వి శత జయంతి సంచిక (సంపాదకత్వం)
- ఆణిముత్యం డా. పోలె ముత్యం ఉద్యోగ విరమణ షష్ట్యబ్ది అభినంద సంచిక (సంపాదకత్వం)
- సచ్చిదానందమయమూర్తి