Tekumalla Rajagopala Rao
Quick Facts
Biography
తేకుమళ్ళ రాజగోపాలరావు (1876-1938) విద్యావేత్త, దార్శనికుడు, పండితుడు, గ్రంథాలయోద్ధారకుడు, రచయిత. ఇతడు వ్రాసిన విహంగ యానం అనే నవల తెలుగులో వెలువడిన మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ నవలగా గుర్తించబడింది.
జీవిత విశేషాలు
రాజగోపాలరావు 1876, జూలై 9న తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురంలో జన్మించాడు. విజయవాడలో స్థిరపడ్డాడు. ఇతడు గ్రంథాలయోద్ధరణకు చేసిన సేవలకుగాను, విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ ఇతని పేర గ్రంథాలయం నెలకొల్పి తన కృతజ్ఞతను చాటుకుంది. ఇతని కుమారుడు రామచంద్రరావు తన వద్ద వున్న అమూల్య గ్రంథాలను ఈ గ్రంథాలయానికి సమర్పించాడు.
జానపద వాఙ్మయ భిక్షువుగా పేరుపొందిన నేదునూరి గంగాధరం గారు తేకుమళ్ళ రాజగోపాలరావు గారి సూచనల ప్రకారమే కట్టుకథలు, పొడుపు కథలు, యుక్తి లెక్కలు మొదలైన వాటిని సేకరించారు.
కందుకూరి వీరేశలింగంతో కలసి ఒకే కళాశాలలో బి. ఎ చదువుకున్నారు. వారిద్దరూ మంచి మిత్రులు. 1902-05 వరకు గుత్తిలో ఉపాధ్యాయునిగా పనిచేసి తరువాత విజయనగరం రిప్పన్ హిందూ థియాలాజికల్ హైస్కూలులో కొంతకాలం పనిచేసాడు. తరువాత మద్రాసు లోని ఒక క్రైస్తవ కళాశాలలో రాజగోపాలరావు ఉపన్యాసకునిగా పనిచేసాడు. అతను గొప్ప చారిత్రక పరిశోధకుడు. సా.శ. 898 నాటి యుద్ధమల్లుని శాసనం లోని మధ్యాక్కర అని మొట్టమొదట కనుగొన్నాడు. తమిళభాష కంటే తెలుగు భాషే పురాతనమైనదని సిద్ధాంతీకరించాడు.
1918 నుండి 1923 వరకు సౌత్ ఇండియన్ రీసెర్చ్ అనే ఆంగ్ల పత్రికను అచ్చు వేసేవాడు.
ఇతని పూర్వీకులు తల్లిదండ్రులు హిందువులు అయినప్పటికీ వీరేశలింగం ప్రభావంతో బ్రహ్మమతంలోకి ప్రవేశించాడు. తరువాత దాని నుండి బయటికి వచ్చి 1916లో హిందూమతాన్ని సంరక్షించుకోవడం అవసరమని తలచి ఆర్ష సమాజం స్థాపించాడు. 1936లో ఆర్ష పత్రికను స్థాపించి కొంతకాలం నడిపాడు.
ఆంధ్రసరస్వతీ గ్రంథమాల స్థాపించి అనేక పుస్తకాలను అచ్చువేయించాడు. తెలుగులోనే కాక కన్నడ, ఇంగ్లీషు భాషలలో కూడా పుస్తకాలను రచించాడు. 1938 డిసెంబరు 8న మరణించాడు.
రచనలు
- శారదా పద్య వాచకములు (ఏడు భాగాలు) - 1930
- విహంగ యానం (తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ నవల) - 1934
- త్రివిక్రమ విలాసము (సాంఘిక నవల) - 1902 - 1902 చింతామణి పత్రిక నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందింది.
- ఛందశ్శాస్త్రము
- మణిభూషణము (సంపాదకత్వం)
- కనకవల్లి (నవల) - 1916
- ఆంధ్ర దేశీయ కథావళి (మూడు భాగాలు)
- లిఖిత - 1914
- పశుశాస్త్రము - 1912