Tallavajjhala Patanjali Shastri
Quick Facts
Biography
తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి తెలుగు రచయిత, పర్యావరణవేత్త. తెలుగు సాహిత్యాన్ని ఆధునీకరించి వారిలో ఒకరైన తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి ఇతని పితామహుడు. మొక్కపాటి నరసింహశాస్త్రి ఇతని మాతామహుడు.1945లో ఇతని తల్లి మహాలక్ష్మి ఊరైన ఉమ్మడి గోదావరి జిల్లాలోని పిఠాపురం లో జన్మించాడు. ఇతని తండ్రి కృత్తివాస తీర్థులు. ఇతని విద్యాభ్యాసం ఒంగోలు, తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నడిచింది. పూణేలోని దక్కను కళాశాలలో పురావస్తు శాస్త్రంలో పి.హెచ్.డి.చేశాడు. ఇతడు తరువాత అమలాపురం లోని డిగ్రీ కళా శాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం చేసి ప్రస్తుతం పూర్తిస్థాయి పర్యావరణవేత్తగా పనిచేస్తున్నాడు. రాజమండ్రిలో "ఎన్విరాన్‌మెంటల్ సెంటర్" అనే పర్యావరణ సంస్థను స్థాపించి నిర్వహిస్తున్నాడు.
2023లో, ఆయన రచించిన 'రామేశ్వరం కాకులు' కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. పుణ్యక్షేత్రమైన రామేశ్వరం లో పిండప్రదానాలు జరుగుతుంటాయి. పిండాలను ముట్టడంలో కాకులకున్న ప్రాధాన్యతను జోడిస్తూ తాత్విక దృక్పధంతో ఈ రచన చేసాడు.
రచనలు
- నలుపెరుపు (కథలు)
- గేదె మీద పిట్ట (నవల)
- వీరనాయకుడు (నవల)
- వడ్లచిలకలు (కథలు)
- దేవర కోటేశు, హోరు (నవలలు)
- తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి కథలు
- మాధవి (నాటకం)
- సూదిలోంచి ఏనుగు (నాటకం)
- అమ్మా! ఎందుకేడుస్తున్నావు? (నాటకం)
- గుండె గోదారి (కవితలు)
- రామేశ్వరం కాకులు (కథలు)
పురస్కారాలు
- 2012 - ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి శ్రీనివాసరావు సాహితీసత్కారం.
- 2016 - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న (హంస) పురస్కారం (2016, ఏప్రిల్ 8)
- 2017 - రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ వారిచే రావిశాస్త్రి అవార్డు
- 2024 - 'రామేశ్వరం కాకులు' కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
పర్యావరణ పరిరక్షణ
స్వచ్ఛంద పదవీ విరమణ తరువాత రాజమహేంద్రవరం లో స్థిరపడి పర్యావరణ పరి రక్షణపై దృష్టి సారించారు. ఈ విషయం పై ప్రజలను చైతన్య పరుచుటకు వ్యాసాలు, పుస్తకాలు రాశాడు. అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాడు. నదీ జలాలు అడవుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 2 లక్షల ఎకరాలలో విస్తరించిన గత 27 ఏళ్లుగా మంచినీటి కొల్లేరు సరస్సు పరిరక్షణ కోసం న్యాయ పోరాటం చేస్తున్నాడు. వలస పక్షులకు ప్రమాదం ఏర్పడుతుందని న్యాయ స్థానాలను ఆశ్రయించి ఆక్రమణలను నిలువరించారు. చిత్తడి నేలల కాపాడడం కూడా చేస్తున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, తీరప్రాంత నియంత్రణ ప్రాధికార సంస్థల్లో సభ్యుడిగా ఉన్నారు. ఐక్యరాజ్యసమితి నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు కమిటీలో సభ్యుడుగా ఉన్నాడు.