Penna Shivaramakrishna
Quick Facts
Biography
పెన్నా శివరామకృష్ణ తెలుగు కవీ, విమర్శకుడు, రిటైర్డ్ లెక్చరర్. 2021లో తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ పురస్కారాన్ని అందుకున్నాడు.
జీవిత విశేషాలు
ఆయన పూర్తి పేరు పెన్నా వేంకట శివరామకృష్ణ శర్మ (పి.వి. యస్. ఆర్. కె. శర్మ). ఆయన నల్గొండ జిల్లా దుగునవల్లి గ్రామంలో 1960 ఫిబ్రవరి 2 న అనంతలక్ష్మి,శేషావతారం దంపతులకు జన్మించారు. ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కట్టంగూరులో చదువుకున్నాడు. నల్లగొండలోని గీతావిజ్ఞాంధ్ర కళాశాల నుంచి, డి. ఓ. యల్. బి. ఓ. యల్. డిగ్రీలను పొందినాడు. హైదరాబాదు విశ్వవిద్యాలయము నుండి యం. ఏ. (1980 - 82), యం. ఫిల్. (1983) డిగ్రీలను పొందినాడు. "శేషేంద్ర కవిత్వానుశీలనం" అనే అంశం మీద పరిశోధన చేసి, అదే హైదరాబాదు విశ్వవిద్యాలయము నుంచి పిహెచ్. డి. పట్టం పొందినాడు.
తెలుగు హైకూలు
తెలుగులో హైకూలను పరిచయం చేసింది ఇస్మాయిల్ (కవి) గారు. 1991లో పెన్నా శివరామకృష్ణ ' రహస్యద్వారం ' పేరుతో తొలి తెలుగు హైకూ కవిత్వ సంపుటిని తీసుకవచ్చాడు. "చినుకుల చిత్రాలు" (2000), "సులోచనాలు" (2006) పేర్లతో మరో రెండు హైకూ సంకలనాలను కూడా పెన్నా శివరామకృష్ణ ప్రచురించాడు. ప్రపంచంలోని, భారతదేశంలోని వివిధ భాషలలో వచ్చిన కొన్ని హైకూలను తెలుగులోనికి అనువదించి "దేశదేశాల హైకూ" (పాలపిట్ట బుక్స్ ప్రచురణ, 2009) అనే మరో అనువాద రచనను కూడా పెన్నా శివరామకృష్ణ వెలువరించాడు. "ప్రపంచ వ్యాప్త కవితా ప్రక్రియ హైకూ", "హైకూ - స్వరూప స్వభావాలు" అనే శీర్షికలతో పెన్నా శివరామకృష్ణ రాసిన రెండు వ్యాసాలు కూడా "దేశదేశాల హైకూ" పుస్తకంలో ప్రచురింపబడినాయి. 1994లో గాలి నాసరరెడ్డి జపాన్ హైకూలను తెలుగులోకి అనువదించారు.
రచనలు
- నిశ్శబ్దం నా మాతృక (కవితాసంపుటి 1987), "అలల పడవలమీద' (కవితాసంపుటి 1990), "రహస్యద్వారం" (హైకూ సంపుటి 1991), "జీవనది" (కావ్యం, 1995), "సల్లాపం" (గజళ్ళ సంపుటి, 2003) శిశిరవల్లకి - పెన్నా శివరామకృష్ణ తెలుగు గజళ్ళు (రచయిత 2011 డిసెంబరు నుంచి 2012 ఆగస్టు వరకు రాసిన సుమారు 90 గజళ్ళ నుంచి ఎన్నిక చేసిన గజళ్ళతో రూపొందించినది ఈ పుస్తకం.) "దీపఖడ్గం" కవితాసంపుటి ప్రచురించారు.
- తెలంగాణ రుబాయీలు.
- దేశదేశాల హైకు
- కవితా దశాబ్ది (1991-2000) (సంపాదకత్వం -ఎస్వీ సత్యనారాయణతో కలిసి),
- దశాబ్దికవిత (2001-2010) (సంపాదకత్వం -ఎస్వీ సత్యనారాయణతో కలిసి)
అవార్డులు
- కవితా సంకలనం "దీపఖండం"కు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించింది.
- పెన్నా శివరామకృష్ణ సెప్టెంబర్ 7, 2021న తెలంగాణ ప్రభుత్వం కాళోజీ పురస్కారానికి ఎంపికయ్యాడు. ఆయన 9 సెప్టెంబర్ 7, 2021న రవీంద్ర భారతిలో జరిగిన కాళోజీ జయంతి ఉత్సవాలలో అవార్డు కింద రూ.1,01,116/- నగదు బహుమతిని, శాలువాను, మెమెంటోను రాష్ట్ర మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, శాసనసభ్యులు రసమయి బాలకిషన్, శాసన మండలి సభ్యులు గోరటి వెంకన్న చేతుమీదుగా అందుకున్నాడు.