Peddi Ramarao
Quick Facts
Biography
పెద్ది రామారావు (మార్చి 17, 1973) తెలుగు నాటకరంగ ప్రముఖులు, తెలుగు కథా రచయిత. ఆయన దూరదర్శన్‌లో చిరకాలంగా ప్రసారమయిన మెగా డెయిలీ సీరియల్ ఋతురాగాలు మాటల రచయితగా తెలుగు ప్రేక్షకలోకానికి సుపరిచితులు. తెలుగు నాటకాన్ని సుసంపన్నం చేయడానికి ఆయన తన "యవనిక" పత్రిక నడిపిన రోజుల నుంచి, ఎంతో కృషి చేస్తున్నారు. మిస్ మీనా, అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి లాంటి అద్భుత నాటకాలతో 'నాటకాని' కి లక్షల్లో ఆడియన్స్ ని సృష్టించిన ఆ అద్భుతానికి కర్త, కర్మ, క్రియ ఆయన. దర్శకత్వం, కథావిస్తరణ అన్నీ ఆయన చేయగలిగినప్పటికీ, తన విద్యార్థులకు ప్రోత్సాహం అందించి పర్యవేక్షణ చేస్తూ విద్యార్థులకు సరైన మార్గనిర్దేశనం చేస్తూ వారితో చేయించిన నిజమైన ఉపాధ్యాయుడు ఆయన.
జననం - విద్యాభ్యాసం
పెద్ది రామారావు 1973, మార్చి 17న గుంటూరు జిల్లా లోని ఉన్నవ గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి పెద్ది సాంబశివరావు రిటైర్డు ఉపాధ్యాయుడు, తల్లి రామ రత్నమ్మ గృహిణి. 1991-94లో నాగార్జున విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. చదివిన రామారావు, 1994-96లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం లో రంగస్థల కళలశాఖలో ఎం.పి.ఏ. పూర్తిచేశారు. 1998-2003లో అదే విశ్వవిద్యాలయంలో నాటకరంగంలో పి.హెచ్.డి. పూర్తిచేశారు.
వివాహం - పిల్లలు
2002, మార్చి 31న తెలుగు టెలివిజన్ నటి అయన శ్రీలక్ష్మి కనకాల తో పెద్ది రామారావు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు (ప్రేరణ, రాగలీన).
జీవిత విశేషాలు
నరసరావుపేటలో చదువుకునే రోజుల్లో రామారావు ఎస్.ఎఫ్.ఐ. అనే వామపక్ష విద్యార్థి సంస్థలో పనిచేశారు. ఆంధ్ర ప్రజానాట్య మండలి సంస్థలో చేరి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. ఒక దశలో ప్రజానాట్య మండలికి పూర్తి కాలపు కార్యకర్తగా 'సేవ' చేయాలని కూడా అనుకున్నారు. 1994 లో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నాటక విభాగంలో ఎం.ఎ చేయడానికి వచ్చిన వీరు అదే విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి చేసారు. కవిత్వం రాసారు. అనేక కథలను నాటకాలుగా మలచి ప్రదర్శించారు. ఎం.ఎ., పి.హెచ్.డి. కి మధ్య గల ఏడాది కాలం ఆయన "సుప్రభాతం" పత్రికలో జర్నలిస్టు గా పనిచేసారు. సమకాలీన రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాసాలు రాసారు. ఆ కాలంలో భద్రాచలం అడవుల్లో నక్సలైట్ దళాన్ని కలసి వారి జీవన విధానంపై ఆసక్తికరమైన కథనం వ్రాసారు.
ఆయనకు దూరదర్శన్ లో ప్రసారమైన ఋతురాగాలులో పనిచేసే అవకాశం లభించింది. అది ఆయన జీవితంలో పెద్ద మలుపు. ఈ అవకాశం ఫలితంగా ఆయనకు స్వయంగా ఆర్థిక శక్తి లభించడంతో దాని ఆసరాతో "యవనిక" అని ఒక ధియేటర్ మాస పత్రికని ప్రారంభించారు. నాటకరంగ వ్యాసాలను రాసి, వాటన్నిటిని "యవనిక" పేరుతో పుస్తక రూపంలో తీసుకువచ్చారు.
ఆయన ఆధునిక నాటకరంగానికి మూల పురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మదినం ఏప్రిల్ 16 న తెలుగు నాటకరంగ దినోత్సవం నిర్వహణలోనూ, నాటకరంగ శిక్షణా శిబిరాలను ఏర్పాటు చెయ్యడంలోనూ క్రియాశీలక పాత్ర వహించారు. ప్రస్తుతం హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయం లోని రంగస్థల కళలశాఖలో ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
నాటకరంగ ప్రస్థానం
- సర్ రతన్ టాటా ట్రస్ట్ ఆర్థిక సహాయంతో రంగస్థల కళల శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయము వారు 2012, జూలైలో ఏర్పాటుచేసిన థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు) కు పెద్ది రామారావు ప్రాజెక్టు సమన్వయకర్తగా పనిచేశారు. ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాంలో భాగంగా మిస్ మీనా, అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి అనే నాటకాలను తయారుచేసి, రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు నాటకరంగాన్ని మరింత ప్రయోజనాత్మకమైన కళాప్రక్రియగా అభివృద్ధిచేయడంకోసం కృషిచేశారు.
- 2010-12 ల మధ్యకాలంలో యూజీసి వారి ఆర్థిక సహకారంతో తెలుగు పద్యనాటకంపై ప్రాజెక్టు చేశారు.
- టెల్వ్ ఆంగ్రీ మాన్ - రచన, దర్శకత్వం - ఫిల్మ్, మీడియా స్కూల్ వారిచే - సమహార నాటకోత్సవం - రవీంద్రభారతి - డిసెంబర్ 16 నుండి 21 వరకు, 2011
- వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి - యవనిక థియేటర్ గ్రూప్
- నాటకోత్సవ సమన్వయ కర్త - జాతీయ నాటకోత్సవం, జనవరి 2001 - కేంద్ర భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ, న్యూఢిల్లీ
- నాటకోత్సవ సమన్వయ కర్త - జాతీయ మహిళా నాటకోత్సవం, మార్చి 2002 - సౌత్ జోన్ సాంస్కృతిక శాఖ, తంజావూర్
- నాటకోత్సవ సమన్వయ కర్త - తెలుగు నాటకరంగ దినోత్సవం 2001, 2002 & 2003 - ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ
- 2001 & 2004లలో ఆంధ్రప్రదేశ్ వివిధ పట్టణాలలోని పాఠశాలలు, కళాశాలలో నాటక శిక్షణా శిబిరాలను నిర్వహించారు.
- చీకట్లో నుంచి చీకట్లోంచి నాటక దర్శకత్వం - గోల్డెన్ త్రెషోల్డ్, 1996
- రూట్స్ నవలను నాటకీకరణ చేశారు. ఇది 1996, ఏప్రిల్ 10న డి.ఎస్.ఎన్. మూర్తి దర్శకత్వంలో రవీంద్రభారతిలో ప్రదర్శించబడింది.
- టాక్స్ ఫ్రీ అనే మరాఠీ నాటికను తెలుగులోకి అనువదించారు. ఇది దాదాపు 20సార్లు ప్రదర్శించబడింది.
- తెలుగు భాష, సంస్కృతి పై మనకథ అనే నాటికను రాశారు. ఇది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రదర్శించబడింది.
టీవి, సినిమారంగ ప్రస్థానం
- చిరంజీవి నటించిన అందరివాడు చిత్రానికి, ఎన్.టి.ఆర్. నటించిన అశోక్ చిత్రానికి సహ రచయితగా పనిచేశారు.
- తెలుగులో మొదటి డైలీ సీరియలైన ఋతురాగాలు (దూరదర్శన్ 1998-2001) 350 భాగాలకు కథ, స్క్రీన్ ప్లే అందించారు.
- 2002లో ఈటీవి లో ప్రసారమైన విధి డైలీ సీరియల్ 200 భాగాలకు స్క్రీన్ ప్లే అందించారు.
- 2003-04లో మాటీవి లో ప్రసారమైన సత్య డైలీ సీరియల్ 150 భాగాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.
- 2006లో ఈటీవిలో ప్రసారమైన ఆలు-బాలు వీక్లీ సీరియల్ 13 భాగాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.
- 2008లో మాటీవిలో ప్రసారమైన యువ వీక్లీ సీరియల్ కు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.
- 2002 నుండి వివిధ డాక్యుమెంటరీలకు, కార్పోరెట్ ఫిలింలకు రచన, దర్శకత్వం చేశారు.
పదవులు
- ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘ మాజీ సభ్యులు
- 2016 మే నెల 27, 28, 29 తేదీల్లో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ కన్వీనరుగా వ్యవహరించారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాడమీల ఏర్పాటుకోసం.. కేరళలో ప్రముఖ సాంస్కృతీక కేంద్రంగా ఉన్న త్రిశూర్ లో ఉన్న వివిధ అకాడమీలు సందర్శించిన బృందంలో పెద్ది రామారావు సభ్యునిగా ఉన్నారు.
పురస్కారాలు
- ఎ.ఆర్. కృష్ణ పురస్కారం (2012)
రచనలు
- యవనిక (నాటక వ్యాసాలు)