Padamati Anvitha Reddy
Quick Facts
Biography
పడమటి అన్వితారెడ్డి, తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ నుండి ఈ ఘనత సాధించిన రెండో మహిళగా గుర్తింపు పొందింది. 18 నెలల్లో ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తయిన పర్వతాలు అధిరోదించాలనే సంకల్పంతో ప్రయాణం మొదలుపెట్టి 2022 డిసెంబరు 17 నాటికి నాలుగు పర్వతాల శిఖరాగ్రాలను అధిరోదించింది. 2023లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.
జననం, విద్య
అన్వితారెడ్డి తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలంలోని యర్రంబల్లి గ్రామంలో జన్మించింది. తండ్రి మధుసూదన్‌రెడ్డి రైతు కాగా, తల్లి చంద్రకళ భువనగిరిలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తిచేసిన అన్వితారెడ్డి, భువనగిరిలోని ఉన్న రాక్ క్లైంబింగ్ స్కూల్లో శిక్షకురాలిగా పనిచేస్తున్నది.
పర్వతారోహణం
17 ఏళ్ళ వయసు నుండి కొండలు ఎక్కడం నేర్చుకున్న అన్విత, రాక్ క్లైంబింగ్ స్కూల్‌లో శిక్షణ పొందింది. ప్రారంభంలో చిన్నచిన్న కొండలను (సిక్కింలోని రీనాక్, బీసీ రాయ్) ఎక్కింది.
ఎవరెస్ట్ శిఖరం
2022 మే 16న ఉదయం 9:30కి ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఎవరెస్ట్ (8848.86 మీటర్లు) శిఖరాన్ని అధిరోహించి, తెలంగాణ నుండి ఈ ఘనత సాధించిన రెండో మహిళగా గుర్తింపు పొందింది.
ఏడు ఖండాలు - ఏడు పర్వతాలు
ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఏడు అత్యంత ఎత్తయిన పర్వతాలను 18 నెలల వ్యవధిలో అధిరోహించడం లక్ష్యంగా పెట్టుకొని 2022 డిసెంబరు 17 నాటికి ఐరోపాలోని ఎల్‌బ్రస్, ఆఫ్రికాలోని కిలిమంజారో, ఆసియాలోని ఎవరెస్ట్, అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ శిఖరాలను ఎక్కింది. త్వరలోనే దక్షిణ అమెరికాలోని అకాంకాగువా, ఆస్ట్రేలియాలోని కార్టెన్జ్ పిరమిడ్, ఉత్తర అమెరికాలోని డెనాలీ పర్వతాలను అధిరోహించనుంది.
ప్రపంచ రికార్డు
ప్రపంచంలో ఎనిమిదో ఎత్తయిన నేపాల్‌లో సముద్ర మట్టానికి 8,163 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ మనస్లు పర్వతాన్ని 2022 సెప్టెంబరు 28న అధిరోహించి, ఈ పర్వతాన్ని అధిరోదించిన తొలి భారతీయురాలిగా అన్విత చరిత్ర సృష్టించింది. భువనగిరి కోటపై పర్వతారోహణ శిక్షణ పొందిన అన్విత, రష్యాలో మంచుతో కప్పి ఉండే 18,510 అడుగుల ఎల్‌బ్రస్ పర్వతాన్ని 2021 డిసెంబరు 7న మైనస్ 40డిగ్రీల చలిలో అధిరోహించి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా పర్వతారోహకురాలిగా రికార్డు నమోదుచేసింది. 2015లో సిక్కింలోని 4,800 మీటర్ల ఎత్తైన రినాక్ పర్వతాన్ని, 2019లో 6,400 మీటర్ల బీసిరాయ్ పర్వతాన్ని, 2020 జనవరిలో 5,896 మీటర్ల ఎతైన కిలిమంజారో పర్వతాన్ని, 2021 ఫిబ్రవరిలో లద్దాఖ్‌లోని 6వేల మీటర్ల ఎత్తైన ఖడే పర్వతాన్ని అన్విత అధిరోహించింది.
పురస్కారాలు
- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - తెలంగాణ ప్రభుత్వం, 2023 మార్చి 8