Mylapore Gouri Amma
Quick Facts
Biography
మైలాపూర్ గౌరి అమ్మ (1892-1971) ఒక భరతనాట్య కళాకారిణి, గురువు.
విశేషాలు
ఈమె 1892వ సంవత్సరంలో మద్రాసు నగరంలో ఒక దేవదాసి కుటుంబంలో జన్మించింది. ఈమె తన తల్లి దొరైకన్నామ్మాళ్ వద్ద, నల్లూర్ మునిస్వామి పిళ్ళై వద్ద తంజావూరు శైలిలో భరతనాట్యాన్ని, చిన్నయ్య నాయుడు వద్ద అభినయాన్ని, అరియకుడి రామానుజ అయ్యంగార్ వద్ద సంగీతాన్ని అభ్యసించింది. ఈమె మైలాపూర్‌లోని కపాలీశ్వర దేవస్థానంలో చివరి దేవదాసిగా సేవించింది. ఈమె భరతనాట్యాన్ని అభినయించేటప్పుడు స్వయంగా పాడేది.
ఈమె తరువాత "కళాక్షేత్ర"లో చేరి నృత్యం, అభినయం నేర్పిస్తూ అనేక మంది శిష్యులను భరతనాట్య కళాకారులుగా తీర్చిదిద్దింది. ఈమె వద్ద నాట్యం నేర్చినవారిలో రుక్మిణీదేవి అరండేల్, టి.బాలసర్వతి,స్వర్ణ సరస్వతి, ఎస్.రాజం, సుధారాణి రఘుపతి, హేమా మాలిని, కళానిధి నారాయణన్, వి.పి.ధనంజయన్, పద్మా సుబ్రహ్మణ్యం, యామినీ కృష్ణమూర్తి మొదలైన వారున్నారు.
ఈమె 1932లో మద్రాసు సంగీత అకాడమీలో నాట్యప్రదర్శనను కావించింది. ఈమెకు గుర్తింపు చాలా ఆలస్యంగా లభించింది. 1956లో మద్రాసు సంగీత అకాడమీ ఈమెను సన్మానించింది. 1958లో ఈమె భరతనాట్యం అకాడమీకి ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకోబడింది. "నృత్యకళానిధి" బిరుదు 1958లో లభించింది. 1959లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఈమెకు భరతనాట్యం విభాగంలో అవార్డును ప్రకటించింది.
ఈమెకు చివరి దశలో కంటిచూపు లోపించింది. ఐనా ఆమె తన 65వ యేట కూడా అభినయం నేర్పించేది. చివరి దశలో ఈమె దారిద్య్రంలో జీవితం గడిపి 1971, జనవరి 21వ తేదీన మరణించింది.