Kotturu Seethaiah Gupta
Quick Facts
Biography
కొత్తూరు సీతయ్య గుప్త సామాజిక సేవకుడిగా, శాసనసభ్యుడిగా, కాంగ్రెస్ నేతగా పేరు తెచ్చుకున్నాడు. హైదరాబాదు నగర అభివృద్ధిలో పాలుపంచుకున్నాడు.
జీవిత విశేషాలు
సీతయ్య గుప్త రంగారెడ్డి జిల్లా బహదూర్‌గూడలో 1911 ఆగస్టు 10న అన్నమ్మ, శ్రీరామన్న దంపతులకు జన్మించాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారమంతా ఇతని పైనే పడింది. ఆముదం మిల్లులో, బట్టల దుకాణంలో పనిచేశాడు. 16వ ఏట హైదరాబాద్‌కు వచ్చి వ్యాపారంపై పట్టు సాధించాడు.
సామాజిక సేవ
ఇతడు మాడపాటి హనుమంతరావుతో కలిసి ఉస్మాన్‌గంజ్ ధర్మశాల నిర్మాణానికి కృషి చేశాడు. 1938 ఏప్రిల్ 16న ధూల్‌పేటలో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనికి వ్యతిరేకంగా చేపట్టిన ‘ఆర్య సమాజ్ సత్యాగ్రహ’ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఇతడు క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్న రోజుల్లో ప్రభుత్వం ఆర్యసమాజ్‌పై ఆంక్షలు, కార్యకర్తలపై నిర్బంధం విధించింది. దత్తాత్రేయ పహాడ్ పైన తలదాచుకున్న కార్యకర్తలకు భోజనం, ఇతర సదుపాయాలు సమకూర్చే బాధ్యతను సీతయ్యగుప్త స్వీకరించాడు. ఆర్య వైశ్యుల అభ్యున్నతికి వాసవి సహకార సంఘాలు ఏర్పాటు చేశాడు. ఇప్పటికీ ఇవి సేవలందిస్తున్నాయి. 1939 జులై 5న కేవలం ఏడుగురు విద్యార్థులతో పీల్‌ఖానాలో వైశ్య హాస్టల్ ప్రారంభించాడు. 1950లో కాచిగూడలో 250 మంది విద్యార్థులకు వసతి భవనం కట్టించాడు. 1963లో వైశ్య హాస్టల్ ట్రస్టును స్థాపించాడు.
రాజకీయరంగం
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌లో ప్రగతిశీల అతివాద వర్గానికి నేతృత్వం వహించిన స్వామి రామానందతీర్థ బాటలోనే గుప్త నడిచాడు. ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత ముఖ్యమంత్రి ఎన్నిక సమయంలో నాయకత్వ సమస్య వచ్చినప్పుడు ఇతడు నీలం సంజీవరెడ్డి వైపు నిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాడు. బేగంబజార్ నియోజకవర్గంలో బలమైన స్థానం ఉన్నప్పటికీ పార్టీ ఆదేశాల మేరకు 1957 సాధారణ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి గెలిచాడు. రెండోసారి 1962 ఎన్నికల్లో బేగంబజార్ నుంచి విజయం సాధించాడు.
విద్యారంగ సేవ
గుప్తా జీవితంలో విద్యారంగ అభివృద్ధికి ఇతోధిక సేవలు అందించాడు. మహిళల కోసం 1943లో సావిత్రి కన్య పాఠశాలను ప్రారంభించాడు. కేశవ స్మారక హిందీ విద్యాలయం పేరుతో వినాయకరావు విద్యాలంకార్ స్థాపించిన విద్యాసంస్థలో ఇతడు వ్యవస్థాపక సభ్యుడు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్, ఆంధ్ర విద్యాలయం కళాశాల, వాసవీ ఫౌండేషన్, భారతీయ విద్యాభవన్ తదితర విద్యాసంస్థల ఏర్పాటులో సీతయ్య చొరవ ఉంది.
హైదరాబాద్ సంస్థాన విముక్తి ఉద్యమం, ఆంధ్రమహాసభ, స్టేట్ కాంగ్రెస్ చేపట్టిన స్వాతంత్రోద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేసి, రాజకీయ, సేవా రంగాల్లో తన సేవలను విస్తరించిన కొత్తూరు సీతయ్య గుప్త 1997లో కన్నుమూశాడు.