J. Vaidyanathan
Quick Facts
Biography
జె. వైద్యనాథన్ ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడు.
విశేషాలు
ఇతడు 1965లో తమిళనాడు, కాంచీపురంలో ఒక సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించాడు.ఇతని తండ్రి "సంగీత కళానిధి" డి.కె.జయరామన్ పేరెన్నికగన్న కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఇతని అత్త డి.కె.పట్టమ్మాళ్ పద్మవిభూషణ్ పురస్కారం పొందిన సంగీతవిదుషీమణి.ఇతడు మృదంగ విద్యను పాల్గాట్ కుంజుమణి, దిండుగల్ రామమూర్తి, శ్రీనివాసన్, టి.కె.మూర్తిల వద్ద నేర్చుకున్నాడు.
ఇతడు ఆకాశవాణి ఎ- టాప్ గ్రేడు కళాకారుడిగా సంగీత సమ్మేళనాలలో, జాతీయ కార్యక్రమాలలో పాల్గొన్నాడు. ఇతడు భారతదేశంలోని అన్ని ముఖ్యపట్టణాలతో పాటు ప్రపంచంలోని పలు దేశాలలో పర్యటించాడు.
ఇతడు కర్ణాటక సంగీతంలో అత్యున్నత శ్రేణి కళాకారులైన డి.కె.జయరామన్, డి.కె.పట్టమ్మాళ్, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, ఎం.ఎల్.వసంతకుమారి, కె.వి.నారాయణస్వామి, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, టి.ఎన్.కృష్ణన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్, ఎస్.బాలచందర్, లాల్గుడి జయరామన్, అరుణా సాయిరాం మొదలైన వారి కచేరీలకు మృదంగ సహకారం అందించాడు. ఇతడు అనేక ప్రతిష్టాత్మక సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడు. చెన్నైలోని డి.కె.జె.ఫౌండేషన్ కమిటీ సభ్యుడిగా, ప్రసారభారతి ప్రాంతీయ బోర్డులో ఆడిషన్ సభ్యుడిగా సేవలందిస్తున్నాడు.
పురస్కారాలు, గుర్తింపులు
ఇతడు తన మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రయాణంలో అనేక అవార్డులు, బిరుదులు అందుకున్నాడు.
- యువ కళాభారతి పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి మార్దంగికుడు.
- శృతి పత్రిక వారి "వెల్లోర్ గోపాలాచారియర్ మెమోరియల్ అవార్డు".
- 2006లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" వారిచే కళైమామణి
- 2010లో కార్తీక్ ఫైన్ ఆర్ట్స్ వారిచే ఇసై పెరొలి పురస్కారం అందుకున్న మొట్టమొదటి మార్దంగికుడు.
- 2016లో కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి అవార్డు