B. Herambanathan
Quick Facts
Biography
బి.హేరంబనాథన్ భరతనాట్య కళాకారుడు, నృత్య దర్శకుడు.
విశేషాలు
ఇతడు తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు పట్టణంలో 1945, జనవరి 12వ తేదీన ఒక సంప్రదాయ సంగీతకారుల, నర్తకుల కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి టి.జి.భావుపిళ్ళై భరతనాట్యకళాకారుడు, మృదంగ విద్వాంసుడు, భాగవతమేళం శిక్షకుడు. తల్లి జీవమ్మ ఒక నృత్యకళాకారిణి. ఇతడు మొదట తన తండ్రి వద్ద భాగవతమేళంలో, మృదంగంలో శిక్షణను తీసుకున్నాడు. తరువాత టి.ఎం.అరుణాచలం పిళ్ళై, కె.పి.కిట్టప్ప పిళ్ళైల వద్ద భరతనాట్యంలో ఆరితేరాడు. భాగవతమేళంలో బాలు భాగవతార్, పి.కె.సుబ్బయ్యార్‌ల వద్ద, మృదంగంలో ఎన్.రాజం అయ్యర్‌ల వద్ద కూడా తర్ఫీదు పొందాడు. ఇతడు వృత్తిరీత్యా పాఠశాల ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని మొదలుపెట్టి, హెడ్మాస్టర్‌గా పదవీవిరమణ చేశాడు. ఇతడు భరతనాట్య కళాకారుడిగా, గురువుగా రాణించాడు. 1970 నుండి 1996 వరకు వరుసగా మేళత్తూర్ భాగవతమేళం ఉత్సవాలలో పాల్గొన్నాడు. తన గురువులు కె.పి.కిట్టప్ప పిళ్ళై, టి.జి.భావుపిళ్ళైల నృత్యాలకు పలు సార్లు నట్టువాంగం నిర్వహించాడు. ఇతడు మలేసియా, సింగపూర్, అమెరికా దేశాలు పర్యటించి అనేక నృత్యనాటికలకు దర్శకత్వం వహించాడు. అక్కడి విద్యార్థులకు నాట్యం నేర్పించాడు.నాట్యానికి సంబంధించి అనేక సెమినార్లలో, వర్క్‌షాపులలో పాల్గొని పత్రసమర్పణ చేశాడు.
1989లో ఇతడు తంజావూరులో తన తండ్రి పేరుమీద "తంజావూర్ భావుపిళ్ళై భరతనాట్యం స్కూలు"ను స్థాపించి అక్కడ భరతనాట్యంతో పాటు సంగీతం, మృదంగంలలో శిక్షణా తరుగతులను ప్రారంభించాడు.
మరాఠీలో శాకుంతలం, తెలుగులో రుక్మిణీకళ్యాణం, హరిశ్చంద్ర, తమిళంలో ఆండాళ్ కళ్యాణం, సుభద్రా కళ్యాణం, శివన్ మాలై కురవంజి, శరభేంద్ర భూపాల కురవంజి, కంసవధం, కైశిక ఏకాదశి, వల్లీ కళ్యాణం వంటి నృత్యనాటికలకు నాట్యాన్ని సమకూర్చాడు. ఇతడు భరతనాట్యం, భాగవతమేళం, రసపండారం, తంజావూరు నృత్య సంప్రదాయం, దేవాలయ పూజలలో నృత్యం, సంగీతం వంటి అనేక విషయాలపై వ్యాసాలు వ్రాశాడు.
ఇతడు తంజావూర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీని నిర్వహిస్తున్నాడు.
పురస్కారాలు
నాట్యరంగంలో ఇతని సేవలను గుర్తించిన తమిళ్ ఇసై సంఘం "నాట్యకళై అరసు", "నట్టువ మామణి" వంటి బిరుదులను ప్రదానం చేసింది. తమిళ్ ఐయల్ ఇసై నాటక మన్రమ్ ఇతడిని కళైమామణి పురస్కారంతో సత్కరించింది. ఇతనికి కేంద్ర సంగీత నాటక అకాడమీ 2013లో భరతనాట్యంలో అవార్డును ప్రకటించింది.