Thota Chandra Shekhar
Quick Facts
Biography
తోట చంద్రశేఖర్ (ఆంగ్లం: Thota Chandrasekhar) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్, రాజకీయ నాయకుడు. తన 21 ఏళ్ళ ఐఏఎస్ సర్వీసులో మహారాష్ట్రలో వివిధ హోదాల్లో పనిచేశాడు. 2023 జనవరి 2న భారత్ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమించబడ్డాడు.
జననం, విద్య
చంద్రశేఖర్ 1963, మే 28న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో సరోజిని - రామారావు దంపతులకు జన్మించాడు. 1977లో ఎస్.ఎస్.సి. పూర్తిచేశాడు. 1979లో హిందూ కళాశాల నుండి ఇంటర్మీడియట్, 1982లో ఎ.సి.కాలేజ్ నాగార్జున విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్సీ., 1984లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎమ్మెస్సీ పూర్తిచేశాడు. 2000లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందాడు.
చంద్రశేఖర్ కు అనురాధతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఆదిత్య శేఖర్, ఒక కుమార్తె అధితి శేఖర్ ఉన్నారు.
వృత్తి జీవితం
మహారాష్ట్ర కేడర్‌కు చెందిన తోట చంద్రశేఖర్ 1997 మే నుండి 2000 మే వరకు థానే మున్సిపల్ కార్పొరేషన్ మునిసిపల్ కమీషనర్‌గా పనిచేశాడు. ఆ మూడేళ్ళకాలంలో థానే నగరాన్ని ప్రణాళికాబద్ధమైన, పరిశుభ్రమైన, అందమైన నగరంగా మార్చాడు. 20 వేలకు పైగా అనధికార నిర్మాణాలను, ఆక్రమణలను తొలగింపజేశాడు. స్లమ్ పాకెట్స్, డంపింగ్ గ్రౌండ్స్‌గా మారిన థానే సిటీలోని దాదాపు 15 సరస్సులను శుభ్రం చేసి సంరక్షించాడు. దాదాపు 20 భారీ ప్రాజెక్టులను అమలు చేశాడు. 2000 సంవత్సరంలో హడ్కో - భారత ప్రభుత్వం అందించిన "క్లీన్ సిటీ ఎ వార్డు"ను కూడా థానే నగరం సాధించింది. చంద్రశేఖర్ థానే నుండి బదిలీ చేయబడినప్పుడు అతని బదిలీకి నిరసనగా ప్రజలు మూడురోజుల బంద్ పాటించారు.
2002 అక్టోబరు నుండి 2005 జూన్ వరకు మెట్రోపాలిటన్ కమిషనర్ గా పనిచేశాడు. ముంబై మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ముంబై అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్, ముంబై అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, ముంబై మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొదలైన ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలు చేశాడు. 18 నెలల రికార్డు సమయంలో బాధిత ప్రజలకు పునరావాసం కల్పించడానికి 50,000 ఇళ్ళను కూడా నిర్మించాడు.
2000 - 2002 వరకు నాగ్‌పూర్ మునిసిపల్ కమీషనర్‌గా పనిచేశాడు. 2002లో నాగ్‌పూర్ నగరానికి రెండవసారి క్లీన్ సిటీ అవార్డును అందుకున్నాడు. రెండు సంవత్సరాల స్వల్ప వ్యవధిలో నాగపూర్ ను మహారాష్ట్ర రెండవ రాజధానిగా రూపానిచ్చాడు. 2008లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అనంతరం ఆదిత్య హైజింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశాడు.
రాజకీయ జీవితం
ప్రజారాజ్యం పార్టీ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టి, 2009 ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయాడు. తరువాత 2014లో వైఎస్సార్‌సీపీ నుంచి ఏలూరు ఎంపీగా, 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు.
2023 జనవరి 2న భారత్ రాష్ట్ర సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి, ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమించబడ్డాడు.