Tadanki Seshamamba
Quick Facts
Biography
తాడంకి శేషమాంబ (1908-1968) తొలి తరం తెలుగు సినిమా నటి. గయ్యాళి అత్త పాత్రలకు ప్రసిద్ధి చెందినది.
తెనాలిలోని సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శేషమాంబకు పదకొండవ యేటనే వివాహం జరిగింది. వృద్ధుడైన ఆమె భర్త తాడంకి వెంకయ్య కూతురు పుట్టిన తర్వాత మరణించడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. పూడగడవని పరిస్థితిని గమనించిన ప్రముఖ లాయర్ నండూరు శేషాచార్యులు, ప్రముఖ డాక్టర్ గోవిందరాజులు సుబ్బారావులు ఈమెను ప్రోత్సహించి, నటనలో శిక్షణ ఇప్పించి, రంగస్థల ప్రవేశం చేయించారు.
తన తొలినాటకం కన్యాశుల్కంలో మధురవాణిగా శేషమాంబ తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించి అలరించడంతో, నాటకరంగంలో స్థిరపడి కుటుంబ నిర్వహణకు ఇబ్బందులు తీరిపోయాయి. పాండవోద్యగవిజాయాలు నాటకంలో కర్ణుడి పాత్ర, ఖిల్జీ రాజ్య పతనంలో కమలారాణి పాత్రలు శేషమాంబకు పేరుతెచ్చి పెట్టాయి.
1939లో వాహినీ పతాకంపై వందేమాతరం సినిమా నిర్మాణంలో ఉన్న దర్శకనిర్మాత బి.ఎన్.రెడ్డికి అందులో గయ్యాళి అత్త పాత్రను పోషించడానికి సరైన నటి దొరకలేదు. ఆ అన్వేషణలో ఉన్న ఆయన మిత్రుల ద్వారా శేషమాంబ గురించి విని ఆమెను పరీక్షించడానికి సముద్రాల, ఎ.కె.శేఖర్ లను తెనాలి పంపాడు. వాళ్ళు శేషమాంబతో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకొని మద్రాసు తిరిగివెళ్ళారు. అలా సినిమా రంగానికి పరిచయమైంది శేషమాంబ. నిజ జీవితంలో అత్త ఆడబిడ్డల అదమాయింపులు, ఆరళ్ళు చాలాకాలం అనుభవించిన శేషమాంబ తన అనుభవసారాన్ని రంగరించి గయ్యాళి అత్త పాత్రను తనదైన శైలిలో అద్భుతంగా పోషించింది.
శేషమాంబ 14-11-1958 తేదీన తెనాలిలోనే మరణించింది. ఈమె కూతురు స్వరాజ్యలక్ష్మి కూడా నటే.