T .K. Jayarama Iyer
Quick Facts
Biography
టి.కె.జయరామ అయ్యర్ కర్ణాటక సంగీత వాయులీన విద్వాంసుడు.
విశేషాలు
ఇతడు తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, కుట్టాలం గ్రామంలో 1894, మే 18వ తేదీన కుప్పుస్వామి అయ్యర్, ధర్మాంబ దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి కుప్పుస్వామి అయ్యర్ వాయులీన విద్వాంసుడు, సంస్కృత పండితుడు, హరికథా కళాకారుడు. ఇతని తమ్ముడు టి.కె.బాలగణేశ అయ్యర్ వేణుగాన కళాకారుడు. ఇతని మేనల్లుడు బి.దక్షిణామూర్తి, మేనకోడలు బి.జ్ఞానాంబాళ్ వాయులీన విద్వాంసులు.
ఇతడు బాల్యం నుండే తండ్రి వద్ద వయోలిన్ నేర్చుకున్నాడు. అలాగే అనయంపట్టి సుబ్బయ్యర్ వద్ద జలతరంగం నేర్చుకున్నాడు. ఇతడు శీర్కాళిలో 1911లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు. తరువాత మనప్పరై, మదురైలలో ప్రభుత్వోద్యోగిగా పనిచేశాడు. మదురైలో పనిచేస్తున్నప్పుడు ఇతడు నాదస్వర విద్వాంసుడు పొన్నుస్వామి పిళ్ళై నుండి ప్రేరణ పొంది సంగీతం పట్ల ఆసక్తిని పెంపొందించుకున్నాడు. క్రమేణా అగ్రశ్రేణి విద్వాంసులకు వాయులీన సహకారం అందించడం ప్రారంభించాడు. 1921లో ఇతడు ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి సంగీత కళాకారుడిగా జీవితాన్ని ప్రారంభించాడు.
ఇతడు ఉమయల్పురం స్వామినాథ అయ్యర్, అరియకుడి రామానుజ అయ్యంగార్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్, కుంభకోణం రాజమాణిక్యం పిళ్ళై వంటి మహామహులతో కలిసి కచేరీలలో పాల్గొన్నాడు. ఇతడు వాయులీనంలో మాలకోట్టై గోవిందస్వామి పిళ్ళై శైలిని అనుసరించేవాడు. క్రమంగా తనకంటూ ఒక కొత్త శైలిని అలవరచుకున్నాడు. 1943లో ఇతడు త్రివేండ్రం స్వాతి తిరునాళ్ సంగీత కళాశాలలో ప్రొఫెసర్‌గా చేరాడు. ఇతనికి తన మాతృభాష తమిళంతో పాటు సంస్కృతం, తెలుగు, మలయాళం, ఇంగ్లీషు భాషలలో ప్రావీణ్యం ఉంది. 1946లో ఆకాశవాణి తిరుచిరాపల్లి కేంద్రంలోసంగీత విభాగంలో చేరి అనేక కార్యక్రమాలనునిర్వహించాడు. తరువాత ఇతడు ఢిల్లీ కేంద్రానికి బదిలీ అయ్యి కర్ణాటక సంగీత వాద్యబృందానికి బాధ్యుడిగా వ్యవహరించాడు. ఇతడు మేఘదూతం, ఋతుసంహారం, అభిజ్ఞాన శాకుంతలం వంటి నృత్య రూపకాలకు సంగీతాన్ని సమకూర్చాడు. 1857 సిపాయీల తిరుగుబాటు శతవార్షికోత్సవాల సందర్భంగా "జ్వాలాముఖి" అనే ప్రత్యేక సంగీతకార్యక్రమాన్ని రూపొందించాడు.ఆకాశావాణి ఉద్యోగం నుండి పదవీ విరమణ పొందాక కూడా దానికి సలహాదారుగా సేవలను అందించాడు. ఇతడు ఢిల్లీలోని త్యాగబ్రహ్మ సభకు, మ్యూజిక్ క్లబ్‌కు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాడు.
ఇతడు మంచి సంగీత గురువు కూడా. ఇతడు అనేక మంది శిష్యులను సంగీత విద్వాంసులుగా తీర్చిదిద్దాడు. ఇతని శిష్యులలోకోవై బి.దక్షిణామూర్తి, బి.జ్ఞానాంబాళ్, తిరువెల్లూర్ సుబ్రహ్మణ్యం, వి.కె.వెంకటరామానుజన్, చారుబాల, అఖిలా కృష్ణన్, మణి కృష్ణస్వామి మొదలైన వారున్నారు. డి.కె.పట్టమ్మాళ్ కూడా ఇతని వద్ద కొంత కాలం వయోలిన్ నేర్చుకుంది.
1960లో మద్రాసు సంగీత అకాడమీ ఇతడికి సంగీత కళానిధి పురస్కారాన్ని అందజేసింది. 1963లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును ఇతడు గెలుపొందాడు. ఇతడు 1971, జూన్ 20 తేదీన మరణించాడు.