SV Satyanaraya
Quick Facts
Biography
ఎస్వీ సత్యనారాయణ (S.V.Sathyanarayana) అభ్యుదయ రచయిత, సాహితీ విమర్శకుడు, తెలుగు ఆచార్యుడు.
జీవిత విశేషాలు
ఇతడు హైదరాబాద్ పాతబస్తీలో 1954, ఆగస్టు 16వ తేదీన జన్మించాడు. అబ్బూరి రామకృష్ణారావు రచనలపై పరిశోధించి ఎం.ఫిల్.పట్టా పొందాడు. తర్వాత ఎన్. గోపి పర్యవేక్షణలో తెలుగులో ఉద్యమగీతాలు అనే అంశంపై పరిశోధించి పి.హెచ్.డి. సాధించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యునిగా పనిచేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా 2014లో పదవీ విరమణ చేశాడు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘంలోను, భారతీయ అభ్యుదయ రచయితల సంఘంలోను క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం సలహామండలి సభ్యుడిగా ఉన్నాడు. ఒక వ్యక్తిగా, వక్తగా, అధ్యాపకుడిగా, సాహితీవేత్తగా ఇతడు సాగించిన ప్రయాణాన్ని ఇతని గురువులు, సహచరులు, శిష్యులు విశ్లేషించిన గ్రంథం ‘ఆత్మీయం’ డాక్టర్ కందిమళ్ళ భారతి సంపాదకత్వంలో రూపొందింది.
2016, జూలై 26 నుండి 2019, ఆగస్టు వరకు తెలుగు విశ్వవిద్యాలయం పదో ఉపకులపతిగా బాధ్యతలు నిర్వర్తించాడు.
రచనలు
ఇతడు 43కు పైగా గ్రంథాలను వెలువరించాడు.
- తెలుగులో ఉద్యమగీతాలు (సిద్ధాంత గ్రంథం)
- అభ్యుదయ సాహిత్యం - ఇతర ధోరణులు, దృక్పథాలు
- ఆధునిక సాహిత్యం - విభిన్న ధోరణులు
- దళిత సాహిత్య నేపథ్యం
- దళితవాద వివాదాలు (సంపాదకత్వం)
- తెలంగాణ సాయుధ పోరాట సాహిత్యం
- తెలంగాణ విమోచనోద్యమం - సాహిత్యం
- గ్లోబలైజేషన్ కథలు
- జాషువా సాహితీ ప్రస్థానం
- తెలుగు సాహితీ వీచిక
- జీవితం ఒక ఉద్యమం (కవిత్వం)
- కవితా దశాబ్ది (1991-2000) (సంపాదకత్వం - పెన్నా శివరామకృష్ణతో కలిసి)
- కవితా దశాబ్ది (2001-2010) (సంపాదకత్వం - పెన్నా శివరామకృష్ణతో కలిసి)
- సత్యానుశీలన
- దృక్పథాలు
- తెలుగుకు తూర్పుదిక్కు ఉత్తరాంధ్ర కథలు (సంపాదకత్వం)
- స్త్రీవాద వివాదాలు (సంపాదకత్వం)
- అవిశ్రాంత పోరాటయోధుడు తమ్మారెడ్డి
- తెలంగాణా వీరనారి ఆరుట్ల కమలాదేవి
- విమర్శక వతంసులు
- యుద్ధం జరుగుతూనే ఉంటుంది (కవిత్వం)
- ప్రజలమనిషి ధర్మభిక్షం
- జనచైతన్యదీపం సురవరం
- ఆలోచన
- రేఖాచిత్రాలు
- సరిగమలు
- ప్రపంచీకరణ - ప్రతిధ్వని
- తెలుగు సాహితీవీచిక
పురస్కారాలు
- 2004లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం.