Surya Dhananjay
Quick Facts
Biography
సూర్యాధనుంజయ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సాహిత్యకారిణి. 2017 నుండి 2022 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విభాగాధిపతి గా పనిచేసింది.దేశంలోనే తొలి లంబాడీ గిరిజన మహిళ ఉపకులపతి .2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ సాహిత్యకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం, తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం -2024 అందుకుంది.
ధనావత్ సూర్యను తెలంగాణ మహిళా యూనివర్సిటీ ఇంఛార్జి వైస్ ఛాన్సలర్ గా నియమిస్తూ 2024 అక్టోబర్ 16న విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేయగా ఆమె అక్టోబర్ 17న కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం (సీఐఎంవీ)లో ఉప కులపతి భాద్యతలు చేపట్టింది.
జీవిత విశేషాలు
సూర్యా ధనుంజయ్ నల్గొండ జిల్లా, మిర్యాలగూడ మండలం, భల్లునాయక్ తండాలో జన్మించింది. తల్లిదండ్రులు ధ్వాళీబాయి, భల్లునాయక్. ఆమె తండ్రి సంఘసంస్కరణ భావాలు కల్గినవాడు. అతని పేరు మీదనే ఆ తండాకు పేరు వచ్చింది. చదువు ప్రాధాన్యతను తెలిసినవాడిగా అతను ఆనాడే తండాలో పాఠశాలను ఏర్పాటు చేయించాడు. వీరిది వ్యవసాయ కుటుంబం. ఆడపిల్లలు పుడితేనే భారంగా భావించే తండా సమాజంలో ఆడపిల్లలకు చదువు ఎంత అవసరమో పసిగట్టిన కుటుంబం కనుక వారి బిడ్డ సూర్యాను బడిలో చేర్పించాడు. సూర్యా జన్మించిన కొద్దిరోజులకే తండ్రిని కోల్పోయింది. తల్లి ద్వాళీబాయి తానే కుటుంబ భారాన్ని మోసింది, బిడ్డలందరిని కష్టపడి పెంచింది. సూర్యా చిన్ననాటి నుండి చదువుమీద చూపిన ఆసక్తిని గమనించి ఎన్ని కష్టాలైనా భరించి ఆమెను చదివించాలనుకుంది. కాని తండ్రి మరణం తర్వాత ఊళ్లోని పాఠశాల మూతపడింది. పక్క తండాలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశాక, ఉన్నత పాఠశాల మిర్యాలగూడకు వెళ్లలేని ఆర్థిక పరిస్థితి. ఆరోజుల్లో తండాకు బస్సు సౌకర్యం లేదు. అటువంటి స్థితిలో తనకు చదువు నేర్పిన గురువులు తల్లి ధ్వాళీబాయికి నచ్చజెప్పడంతో మిర్యాలగూడలోని బాలికల ఉన్నత పాఠశాలలో చేరింది. తండా నుండి మిర్యాలగూడకు రోజు నడిచి వెళ్ళేది. కొంతకాలానికి ఎస్సి బాలికల హాస్టల్లో సీటు రావడంతో అక్కడే ఉండి పదవ తరగతి పూర్తిచేసింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే ఆమె వివాహం ధనంజయ్ నాయక్ తో జరిగింది. రెండవ సంవత్సరంలో బాబు సంజయ్ జన్మించాడు. దానితో చదువు మధ్యలోనే ఆగిపోయింది. అనంతరం భర్త ప్రోత్సాహంతో అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం దూరవిద్య ద్వారా బీఏ పూర్తిచేసి ఆంధ్ర మహిళా సభలో బిఇడి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు, బిఎల్ఐఎస్సి చేశారు. అనంతరం "రామాయణ అరణ్య కాండలోని ఆశ్రమాలు-శ్రీరాముని దర్శనాలు" అనే అంశంపై ఎంఫిల్, "నల్గొండ జిల్లా బంజారా సాహిత్యం - జీవన చిత్రణ" అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందింది. తాను చదువుకున్న తెలుగుశాఖలోనే ప్రొఫెసర్ ఉద్యోగాన్ని సంపాదించింది. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో సీనియర్ ఆచార్యులుగా, సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ కు డైరెక్టర్ గా కొనసాగుతోంది.
సాహిత్యకృషి
సూర్యాధనుంజయ్ 20 ఏళ్ళుగా సాహిత్యరంగంలో కృషి చేస్తోంది.
- "రామాయణ అరణ్య కాండలోని ఆశ్రమాలు - శ్రీరాముని దర్శనాలు" గ్రంథం పరిశోధకులకు మార్గదర్శనంగా ఉపయోగపడుతోంది.
- పరిశోధన సిద్ధాంత గ్రంథం"నల్గొండ జిల్లా బంజారా సాహిత్యం జీవన చిత్రణ" ద్వారా తొలిసారిగా బంజారా సాహిత్యాన్ని తెలుగు పాఠకలోకానికి అందించింది.
- "బంజారా నానీలు" బంజారాల వ్యథలకు ప్రతిరూపాలయ్యాయి.
- "తాంగ్డీ"సాహిత్య వ్యాస సంపుటిలో బంజారాల జీవనాన్ని హృద్యంగా మలిచింది.
- "గమనం" వ్యాస సంపుటితో సాహిత్యంలోని విభిన్న కోణాలను, రచయితల కవితా హృదయాన్ని ఆవిష్కరించింది.
- అనువాదకురాలిగా 'చతురాయికి బహుమాన్' అనే హిందీ కావ్యాన్ని తెలుగులోకి 'చతురతకు బహుమానం' అన్న పేరుతో అనువాదం చేసింది.
- 'సినారె సాహితీ వైభవం","తెలంగాణ సాహిత్యం సమాలోచన" వంటి సాహిత్య వ్యాస సంకలనాలకు సంపాదకురాలిగా ఉంది.
- "శత వాసంతిక" నూరేళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విజ్ఞాన సర్వస్వం లాంటి గ్రంథం. దీనికి సంపాదకురాలిగా వ్యవహరించింది
- GOR BANJARA (An Enduring Tribe) బంజారాల చారిత్రక, సామాజిక అస్తిత్వ ప్రతీకగా ప్రసిద్ధి చెందింది. డా.సూర్యాధనంజయ్ మరియు డా.ఎం.ధనంజయ్ నాయక్ ల రచనలో ఈ గ్రంథం వెలువడింది.
- "ఝోళి" (గోర్ బంజారా సాకి)కథా సంపుటి. బంజారాల జీవన చిత్రానికి ప్రతీకగా నిలిచింది.
- "కేసులా" (కథల సంకలనం) సంపాదకత్వం.
- బంజారా చరిత్ర (తెలుగు)బంజారాల చారిత్రక, సామాజిక అస్తిత్వ ప్రతీకగా ప్రసిద్ధి చెందింది. డా.సూర్యాధనంజయ్ మరియు డా.ఎం.ధనంజయ్ నాయక్ ల రచనలో ఈ గ్రంథం తెలుగులో వెలువడింది.
- కొంగుబంగారం (సమ్మక్క,సారాలమ్మ) జాతర చరిత్ర
- ముడుపు (తెలంగాణ జాతరల సమాహారం)
- వ్యాసకర్తగా 70కి పైగా జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో తన బాణిని వినిపించింది.
- "అమెరికన్ ఫోక్లోర్ సొసైటీ" వారు అమెరికాలో నిర్వహించిన సదస్సుకు హాజరై "భారతీయ సంస్కృతిలో బంజారాల వస్త్ర, ఆభరణాల ప్రాముఖ్యత" అనే అంశంపై పత్ర సమర్పణ చేసింది. నాడు చేసిన ప్రసంగం ఎందరో మేధావులను భారతదేశం వైపు చూసేలా చేసింది.
నిర్వహించిన సాహితీ కార్యక్రమాలు, సదస్సులు:
- 2017 ఆగస్టు30,31 వ తేదీల్లో "సినారె సాహితీ వైభవం" రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించి, సి. నారాయణరెడ్డికి ఘనమైన సాహితీ నివాళిని సమర్పించింది.
- ప్రపంచ తెలుగు మహాసభలు 2017 సందర్భంగా "తెలుగుకు వెలుగు"చర్చా కార్యక్రమం, సృజనాత్మక పోటీలు నిర్వహించింది.
- తెలుగుశాఖ శతాబ్ది సంబరాలను 2019 జనవరి 31వ తేదీన కనీవినీఎరుగని రీతిలో గొప్ప వేడుకగా ప్రారంభించి, ఇందులో భాగంగా "తెలుగుశాఖ అపూర్వ విద్యార్థిని, తొలి ఎంఏ పట్టా పొందిన మహిళా అయిన ఇల్లిందుల సుజాత గారిని సగౌరవంగా సన్మానించడంలో పాత్ర పోషించింది.
- తెలుగుశాఖ వెబ్సైట్ ను ఆవిష్కరించుకోవడం, అలుమిని అసోసియేషన్ ఏర్పాటు" చేయడంలో కృషి చేసింది.
- తెలుగుశాఖ విశ్రాంత ఆచార్యులను వారి సేవలను స్మరిస్తూ వారిని ఘనంగా సన్మానించే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.
- "తెలంగాణ సాహిత్యం సమాలోచన" అన్న అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును పరిశోధక విద్యార్థుల కోసం నిర్వహించింది.
- "తెలంగాణ గిరిజన సంస్కృతి, సాహిత్యం" అన్న అంశంపై ఒకరోజు రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించింది.
- "తెలంగాణ చరిత్రలో రెడ్డి పాలకులు సాహిత్యం,సమాజం" రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించింది.
- "తెలుగుశాఖ ఆచార్యుల సాహిత్యం సమాలోచన" రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించింది.
- "కవయిత్రుల కవితా గానం" కార్యక్రమం నిర్వహించి కవయిత్రులను సన్మానించింది.
- ఉమెన్స్ స్టడీస్, కేంద్ర సాహిత్య అకాడమీ వారి సంయుక్త ఆధ్వర్యంలో "కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచయిత్రుల సాహిత్యం" (లిటరసీ ఫోరం) పై ఒకరోజు సదస్సు నిర్వహించింది.
- డిగ్రీ అధ్యాపకుల బోధనా సామర్థ్యాన్ని మెరుగులు దిద్దే "పునశ్చరణ తరగతులు" (రిఫ్రెషర్ కోర్స్) ను 2018, 2019 సంవత్సరాల్లో రెండుసార్లు నిర్వహించింది.
- పరిశోధక విద్యార్థుల కోసం అవగాహన తరగతులు, విస్తరణోపన్యాసాలు వంటివి చేపట్టింది.
సామాజిక సేవ
- "యాడి" (అమ్మ) చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి నిరుపేద గ్రామీణ, తండా బిడ్డల చదువుకు తనవంతు సహకారం అందిస్తోంది.
- ఉజ్వల్ క్రియేషన్స్, శీతల్ పబ్లికేషన్స్ సంస్థలను స్థాపించి యువ రచయితలను ప్రోత్సహిస్తోంది.
పదవీ బాధ్యతలు
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులుగా తన పాలనాదక్షతను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఈమె ఎన్నో పదవులను చేపట్టింది.
- జాతీయ సేవా పథకం (NSS) నిర్వహణాధికారి (2002-2003)
- ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా వసతిగృహ వార్డెన్ (2006-2008)
- యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణాధికారి (2010-2015)
- ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ సభ్యురాలు (2010-2015)
- పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షురాలు (2012-2016)
- విద్యార్థి సంక్షేమాధికారిగా (2012 నుండి)
- 2012లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయ 'యువతరంగ్ ' కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యురాలు
- మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షురాలు (2012 నుండి)
- పాలమూరు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షురాలు(2012 నుండి)
- తెలంగాణ ఉన్నత విద్యామండలి సభ్యురాలు (2014-2017)
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారు అందించే పురస్కారాల ఎంపిక కమిటీ సభ్యురాలు (2015-2017)
- 2016వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే దాశరథి పురస్కారం ఎంపిక కమిటీ సభ్యురాలు
- 2017వ సంవత్సరంలో పాఠ్యప్రణాళికా సంఘం అధ్యక్షులుగా ఉన్నారు.
- ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులు (2017 జూలై నుండి 2022 వరకు)
- 2017వ సంవత్సరంలో ఓయూ శతాబ్ది సంబరాల నిర్వహణ కమిటీ సభ్యురాలు
- యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ లో ఉమెన్స్ సెల్ అధ్యక్షులు (2018-2019)
- ఉమెన్స్ స్టడీస్ డైరెక్టర్ (2018-2022)
- వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ ఇంఛార్జీ వైస్ ఛాన్సలర్ (17-అక్టోబర్ 2024-)
రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం-2024
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో సీనియర్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆచార్య సూర్యా ధనంజయ్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపిక చేసింది. విశ్వవిద్యాలయ స్థాయిలో అపారమైన బోధనానుభవం, విలువైన సేవలను గుర్తించిన ప్రభుత్వం వారికి ఈ అవార్డును అందించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటైన గురుపూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 05, 2024, గురువారం సాయంత్రం 4.00 గం,లకు రవీంద్రభారతి హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బీసి సంక్షేమ& రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు.ప్రొఫెసర్ సూర్యాధనంజయ్ తెలంగాణ రాష్ట్ర తొలి ఉన్నత విద్యామండలి సభ్యురాలిగా, దాశరథి అవార్డుల ఎంపిక కమిటీ సభ్యురాలిగా, నెషనల్ బుక్ ట్రస్ట్ ,కేంద్ర సాహిత్య ఆకాడమీ యువ పురస్కారాల ఎంపిక కమిటీ సభ్యురాలుగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగా సెప్టెంబర్ 05, 2024, గురువారం సాయంత్రం 4.00 గం,లకు రవీంద్ర భారతి హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బీసి సంక్షేమ& రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. డాక్టర్.సూర్యాధనంజయ్ తెలంగాణ రాష్ట్ర తొలి ఉన్నత విద్యామండలి సభ్యురాలిగా, నెషనల్ బుక్ ట్రస్ట్ ,కేంద్ర సాహిత్య ఆకాడమీ యువ పురస్కారాల ఎంపిక కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.
మహిళా వర్సిటీకి ఇన్ చార్జి వీసీ
తెలంగాణ మహిళా యూనివర్సిటీ వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ ఇంఛార్జ్ వైస్ ఛాన్సలర్ గా ఉస్మానియా యూనివర్సిటి తెలుగు విభాగం ఆచార్యులు ప్రొఫెసర్ ధనావత్ సూర్యా నియమితులయ్యారు.హైదరాబాదు లోని కోఠి ఉమెన్స్ కాలేజీలో 2024 అక్టోబరు 17న ఆమే బాధ్యతలు స్వీకరించింది.
పురస్కారాలు
- జ్యోత్స్న కళాపీఠం వారి "ఉగాది పురస్కారం" (2011)
- "బంజారా అక్షర దివిటి అవార్డు" (2013)
- సాహిత్య రంగంలో విశేష కృషిచేస్తున్నందుకు 'వి.పి నాయక్ యువసంఘటన్ మరియు దాపురా బంజారా సమాజ్ మహారాష్ట్ర' వారి "బంజారా మహిళా రత్న" రాష్ట్రీయ పురస్కారం-జూలై 2013.
- జాతీయ బంజారా మహోత్సవాల్లో "వసంత్ భూషణ్ పురస్కారం" (2014)
- శ్రీ సోమ సీతారాములు తెలంగాణ రాష్ట్ర స్థాయి పురస్కారం" (2014)
- ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్య పరిషత్ వారి "రామరాజు విజ్ఞాన బహుమతి" (2015)
- "ఎస్వీఆర్ పురస్కారం" (2016)
- "ఆచార్య మడుపు కులశేఖర రావు పురస్కారం" (2017)
- "ఇందిరాగాంధీ స్మారక అవార్డు" (2017)
- "మదర్ థెరిస్సా స్మారక అవార్డు" (2017)
- ప్రమీలా శక్తిపీఠం వారి "ప్రమీలా శక్తిపీఠం సాహిత్య పురస్కారం"(2017)
- హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ వారి "ఇందిరా ప్రియదర్శిని నేషనల్ అవార్డు"(2017)
- దళిత సాహిత్య అకాడమీ వారి "సావిత్రిబాయి పూలే జాతీయ అవార్డు" (2018)
- జానపద సాహిత్య పరిషత్తు వారి "జానపద సాహితీ రత్న పురస్కారం" (2018)
- సాహితీ మేఖల నల్గొండ వారి "శ్రీ విలంభి నామ సంవత్సర ఉగాది పురస్కారం"(2018)
- "బి.ఎస్ రాములు ప్రతిభా పురస్కారం"(2019)(విశాల సాహిత్య అకాడమీ & సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం)
- శ్రీ కమలకర లలిత కళా భారతి సాహిత్య, సామాజిక, సాంస్కృతిక,ఆధ్యాత్మిక సేవా సమితి హైదరాబాద్ వారి "శ్రీమతి ఇల్లిందుల సరస్వతీ, శ్రీ సీతారామరావు సాహిత్య పురస్కారం"(2019)
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి "విశిష్ట మహిళా పురస్కారం" (2020)
- తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ వారి "మహిళా శిరోమణి"పురస్కారం(2021)
- 'భానుపురి సాహితీ వేదిక' సూర్యాపేట వారి 'నానీ శిరోమణి' అవార్డ్ (2022)
- పోస్టల్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎంప్లయ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి "జైభీం అవార్డ్ 2022"
- 'మొల్ల సాహిత్య కళా వేదిక' వారి కవయిత్రి మొల్ల సాహితీ పురస్కారం (2023)
- తెలంగాణ రచయితల సంఘం, గండ్ర హన్మంతరావు స్మారక సాహిత్య కమిటీ వారి ప్రతిష్ఠాత్మక "గండ్ర హన్మంతరావు స్మారక సాహిత్య పురస్కారం2021 (2023)
- మానేరు రచయితల సంఘం (మారసం ) వారి 'గూడూరి సీతారాం కథా పురస్కారం-2023' (జోళి కథా సంపుటికి)
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి 'రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం-2024'