Sujatha Deekshith
Quick Facts
Biography
సుజాత దీక్షిత్ తెలుగు నాటకరంగ, టీవీ, సినిమా నటి, వ్యాఖ్యాత. పలు టీవి ఛానళ్ళలోనూ, స్టేజీల మీద వివిధ కార్యక్రమాలకు, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సుజాత, వి6 న్యూస్ ఛానల్లో ప్రసారమవుతున్న తీన్మార్ వార్తలు కార్యక్రమంలో చంద్రవ్వ పాత్రతో గుర్తింపు పొందింది. 2023లో తెలంగాణ ప్రభుత్వం నుండి నాటకరంగంలో తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.
జననం - విద్యాభ్యాం
సుజాత జూలై 10న సంగారెడ్డిలో జన్మించింది. తండ్రి రామస్వామి సంగారెడ్డి బాలికల ఉన్నత పాఠశాలో సంగీత ఉపాధ్యాయడిగా పనిచేసి, పదవీ విరమణ పొందాడు. అమ్మ లక్ష్మీ గృహిణి. సుజాతకు ముగ్గురు అన్నలు, ఒక అక్క. చిన్నప్పటి నుండే చదువులో చురుగ్గా ఉన్న సుజాత సికింద్రాబాదులోని వెస్లి బాలికల ఉన్నత పాఠశాలో 10వ తరగతి వరకు, తార్నాకలోని రైల్వే జూనియర్ కళాశాలలో ఇంటర్ వరకు చదివింది. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బి.కామ్ డిగ్రీ పూర్తిచేసి హైదరాబాదు విశ్వవిద్యాలయంలోని నృత్యశాఖలో, తెలుగు విశ్వవిద్యాలయంలోని జర్నలిజంశాఖ, తెలుగుశాఖ, రంగస్థల కళలశాఖలలో పీజీలు చేసింది. మెదక్ జిల్లా జానపద కళారూపాలు అనే అంశంపై పిహెచ్.డి. పరిశోధన కూడా చేసింది.
వివాహం
నటుడు, నట శిక్షకులలైన డి.యస్. దీక్షితులు దగ్గర నటనలో శిక్షణ కొరకు వెళ్ళినప్పుడు దీక్షిత్ కొడుకు శ్రీధర్ దీక్షిత్ తో జరిగిన పరిచయం ప్రేమగా మారి, పెళ్ళి చేసుకున్నారు. శ్రీధర్ దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నాడు. వీరికి ఒక కొడుకు శ్రీశ్రీ.
నృత్య, సంగీతరంగం
నాలుగేళ్ళ వయసులోనే కూచిపూడి నృత్యాన్ని నేర్చుకోవడమేకాకుండా 1995లో తెలుగు విశ్వవిద్యాలయంలో కూచిపూడిలో శిక్షణ తీసుకున్న సుజాత రవీంద్రభారతిలోనూ, ఇతర రాష్ట్రాలలోనూ నాట్యప్రదర్శనలు చేసింది. జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని పలు అవార్డులు అందుకుంది. జన విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో ఆక్షరకళ యాత్రలో మెదక్ జిల్లా, నిజామాబాదు జిల్లాల్లో వీధి నాటకాలు, గొల్లసుద్దుల ప్రదర్శనలలో పాల్గొన్నది. ప్రస్తుతం ఔత్సాహికులకు కూచిపూడి నృత్యాన్ని నేర్పిస్తూ, కర్ణాటక సంగీతాన్ని నేర్చుకుంటోంది.
నాటకరంగం
తెలుగు విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళలశాఖలో ఎం.పి.ఏ. చదివిన సుజాత నాటకాలు, నాటికల్లో ప్రధాన పాత్రల్లో నటించింది.
- భరత విలాపం (సీత)
- భాగ్యనగర్ (భాగమతి)
- లోక రక్షకుడు (మరియా)
- మహాత్మ జ్యోతిరావు పూలే (సావిత్రిబాయి పూలే)
- ప్రతాప రుద్రమ (మాచల్దేవి)
టివీరంగం
చిన్నప్పటి నుంచి స్టేజ్‌పై ప్రదర్శనలు చేసిన అనుభవం ఉండడంతో హమేషా తమాషా కార్యక్రమంలో డ్యాన్స్ చేసింది. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో పీజీ చేసేటప్పుడు సాంప్రదాయ దుస్తులు వేసుకొని స్టేజ్‌పై ఒక పాట పాడింది. అది చూసిన ఒక ఛానల్ వాళ్లు జస్ట్ ఫర్ యు కార్యక్రమంలో యాంకరింగ్ అవకాశం ఇచ్చారు. ఆ తరువాత అనేక కార్యక్రమాలు, సోషల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్, సెలబ్రిటీల ఇంటర్వ్యూ వంటి కార్యక్రమాలకు యాంకరింగ్ చేసింది. దూరదర్శన్ యాదగిరిలో ఆలాపన అనే డైలీ కార్యక్రమం 340 ఎపిసోడ్స్ యాంకర్‌గా చేసి మిరాకిల్స్ ‘వరల్డ్ రికార్డ్’అందుకోవడమే కాకుండా పలు ఛానల్స్ తరఫున యాంకర్‌గా ఏడుసార్లు అవార్డులు అందుకుంది. వివిధ ఛానళ్ళు రూపొందిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ, బతుకమ్మ,బోనాలు వంటి పాటలలో నటించిన సుజాత, ప్రస్తుతం వి6 న్యూస్ లో ప్రసరమవుతున్న తీన్మార్ వార్తలు కార్యక్రమంలో చంద్రవ్వ పాత్రలో నటిస్తోంది.
- మీ ఇంటి వంట (ఈటీవీ 2)
- సఖి (ఈటీవీ 2)
- తెలుగు వెలుగు (ఈటీవీ 2)
- లక్కీ లేడీ లవ్లీ శారీ (ఈటీవీ 2)
- బొమ్మాళీ బాక్సాఫీస్ (ఈటీవీ 2)
- సుజాత నటించిన సినిమా పోస్టర్
- బ్రేక్ ఫాస్ట్ (దూరదర్శన్ యాదగిరి)
- ఆలాపన (దూరదర్శన్ యాదగిరి)
- ధర్మ సందేహాలు (దూరదర్శన్ యాదగిరి)
- జానపదం దుమ్మురేపు (హెచ్ ఎమ్ టివి)
- దరువు
- తీన్మార్ వార్తలు (వి6)
సినిమారంగం
బాపు దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర వైభవం సీరియల్‌లో దేవకీ పాత్రతో నటించిది. ఆపద మొక్కులవాడు, జన్మస్థానం వంటి చిత్రాల్లో జిందగీ, ముద్దుగారే యశోద వంటి లఘుచిత్రాలలో నటించింది.
- సురాపానం (2022)
- షరతులు వర్తిస్తాయి (2024)
- ది డీల్ (2024)
పురస్కారాలు
- ఉత్తమ యాంకర్ ప్రత్యేక బహుమతి (బుల్లితెర పెద్ద పండుగ,రవీంద్రభారతి, 23.08.2018)
- ఉత్తమ యాంకర్ (శృతిలయ ఆర్ట్స్ అకాడమీ యాంకర్ పురస్కారాలు-2018, రవీంద్రభారతి, హైదరాబాదు, 18.04.2018)
- సింగిడి విశిష్ట యువ పురస్కారం (సింగిడి సాంస్కృతిక సంస్థ సింగిడి విశిష్ట యువ పురస్కారాలు, తెలుగు విశ్వవిద్యాలయం, 18.06.2018)
- ఉత్తమ యాంకర్ (మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వమించిన హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ లో మంత్రి కేటీఆర్ నుండి, 05.04.2022)
- నాటకరంగంలో తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - తెలంగాణ ప్రభుత్వం, 2023 మార్చి 8