Sriramoju Haragopal
Quick Facts
Biography
శ్రీరామోజు హరగోపాల్, తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత, ఉపాధ్యాయుడు, చరిత్ర పరిశోధకుడు. 2022లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు.
జననం, విద్య
శ్రీరామోజు హరగోపాల్ 1957, మార్చి 25న విశ్వనాధం, వరలక్ష్మీ దంపతులకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు పట్టణంలోని పోచమ్మవాడలో జన్మించాడు. ఎం.ఏ.తెలుగు, ఎం.ఇడి. చదివాడు.
ఉద్యోగం
ఉన్నత పాఠశాలలో ఎస్జీటీ, గ్రేడ్-2 తెలుగు పండిట్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయునిగా, గెజిటెడ్ హెడ్ మాష్టర్ గా పనిచేసి 2013లో పదవీవిరమణ చేసాడు. ఉపాధ్యాయ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేసాడు.
వ్యక్తిగత జీవితం
అతని భార్య పద్మావతి. వారికి నీలిమ, సుధీర్ కుమార్, శ్రీహర్ష, శరత్ భాను పిల్లలు ఉన్నారు.
సాహిత్య ప్రస్థానం
హరగోసాల్ తండ్రి విశ్వనాధం కవి, సాహితీవేత్త. తన తండ్రి నుంచి స్ఫూర్తిపొందడంతోపాటు విద్యార్థిగా ఉన్నప్పుడే తిరునగరి రామానుజయ్య దగ్గర వచనకవిత్వంలో మెళకువలు నేర్చుకున్నాడు. వచన కవిత్వంలో తనకంటూ ప్రత్యేక ఒరవడిని సృష్టించుకున్నాడు. హరగోపాల్ రాసిన మొదటి కవిత దానిమ్మపూవు ఉజ్జీవనలో ప్రచురితం అయింది. కొన్ని కవితలు కృష్ణాపత్రిక, స్రవంతి వంటి పత్రికల్లో కూడా అచ్చయ్యాయి. పలు పత్రికలకు సాహిత్య వ్యాసాలు, సమీక్షలు రాశాడు. అనేక సాహిత్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు. అతను రాసిన కవిత్వాన్ని సంపుటులుగా ప్రచురించాడు. 1987లో ఆలేరులో రచనసాహితీకళావేదిక అనే సాహిత్యసంస్థను స్థాపించి అనేక సాహిత్యకార్యక్రమాలను నిర్వహించాడు. అనేక పుస్తకాలను సంస్థ తరపున ప్రచురించాడు. నెలా నెలా రచన కార్యక్రమాన్ని చాలా సంవత్సరాలపాటు నిర్వహించాడు. 1994లో బాలచంద్రిక అనే పిల్లలసంస్థను ఏర్పాటుచేసి ప్రతిసంవత్సరం పిల్లలకు సాహిత్య, సాంస్కృతిక, క్రీడా, బౌద్ధిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. 1999లో ఆలేరులో కాళోజీ అధ్యక్షతన సాహిత్య కార్యక్రమం కూడా నిర్వహించాడు. పుస్తకసమీక్షలు, సాహిత్యవ్యాసాలు, గల్పికలు, నాటికలు, కథలు, పాటలు రాసాడు. అతని పాటల్ని గాలి అలలమీద నీ నవ్వులు అనే పాటల ఆల్బంగా తెచ్చాడు.
కవితా సంకలనాలు
- 1991: మట్టిపొత్తిళ్ళు
- 2006: మూలకం
- 2015: రెండుదోసిళ్ళకాలం
- 2020: కొండపొదుగుపూలు
- చెలిమెలు
చరిత్రకారుడిగా
పదవీ విరమణ తరువాత తెలంగాణ జాగృతి చరిత్ర విభాగంలో పనిచేశాడు. అతనితో కలిసివచ్చిన మిత్రులు, మార్గదర్శకులతో కలసి కొత్త తెలంగాణ చరిత్ర బృందాన్ని ఏర్పాటుచేసి, ఆ బృంద కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ తెలంగాణా అంతట పర్యటిస్తూ తెలంగాణ చరిత్రను అధ్యయనం చేస్తున్నాడు. ఆదిమానవ సంస్కృతి, నాగరికతలు, గ్రామాల చరిత్ర, శాసన పరిష్కరణ, స్థానిక చరిత్రల గురించి అన్వేషణ చేస్తున్నాడు. సొంత ఊరు ఆలేరు చరిత్రను అధ్యయనం చేసి ‘ఆలేటి కంపణం’ పుస్తకాన్ని, దక్కన్ పీఠభూమిలోని పురావస్తు శాస్త్రం, వారసత్వం, శాసనాలపై తాను రాసిన రాసిన రచనలతో 'తెలంగాణ చరిత తొవ్వల్లో' (మన గత చరిత్ర యొక్క నిధి పుస్తకం) అనే సంకలనాన్ని వెలువరించాడు.
పురస్కారాలు
కవిగా, సాహిత్య పరిశోధకునిగా పలు అవార్డులు అందుకున్నాడు.
- 2022: తెలంగాణ ప్రభుత్వ రాష్ట్రస్థాయి కాళోజీ సాహిత్య పురస్కారం (రవీంద్రభారతి, 2022 సెప్టెంబరు 9)
- 2017: జయశంకర్ అవార్డు
- 2016: కేఎల్ నర్సింహారావు సాహిత్య అవార్డు
- 2015: సామల సదాశివ రాష్ట్ర స్థాయి అవార్డు
- పాలమూరు సాహిత్య అవార్డు
- భారతీయ దళిత సాహిత్య ఆకాడమీ అవార్డు