Srinivasa Reddy
Quick Facts
Biography
శ్రీనివాసరెడ్డి తెలుగు చలనచిత్ర దర్శకుడు. తక్కువ బడ్జెటుతో హాస్య చిత్రాలు తీసి గుర్తింపు పొందాడు. సహాయ దర్శకుడిగా సినీజీవితం ప్రారంభించిన శ్రీనివాసరెడ్డి, 1997లో ఆలీ హీరోగా వచ్చిన ఆషాడం పెళ్ళికొడుకు సినిమాతో దర్శకుడిగా మారాడు.
జీవిత విషయాలు
శ్రీనివాసరెడ్డి 1969లో పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని వెలగలవారిపాలెం గ్రామంలో జన్మించాడు. స్వగ్రామంలో ప్రాథమిక విద్యను, పెనుమంట్రలో హైస్కూల్ విద్యను పూర్తిచేశాడు. తరువాత భీమవరంలోని డిఎన్ఆర్ ఇంటర్ కాలేజీలో చేరి, చదువు మధ్యలోనే ఆపేసి కర్ణాటకకు వెళ్ళాడు.
సినిమారంగం
శ్రీనివాసరెడ్డి తన సినీజీవితం ప్రారంభంలో వివిధ దర్శకుల దగ్గర కన్నడ, తెలుగు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 1984లో కన్నడ దర్శకుడు విజయరెడ్డికి సహాయకుడిగా చేరాడు. ఎం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి పరిచయంతో తెలుగులో తొలిసారిగా ఆహుతి సినిమాకు కోడి రామకృష్ణ ఆధ్వర్యంలో దర్శకత్వ విభాగంలో పనిచేశాడు. తరువాత జి. రామ్ మోహన్ రావు, వై. నాగేశ్వరరావులు దర్శకత్వం వహించిన వివిధ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. శివనాగేశ్వరరావుతో కలిసి మరో మూడు చిత్రాలకు సహ దర్శకుడిగా పనిచేశాడు.
అదే సమయంలో శ్రీనివాసరెడ్డి, తన స్నేహితులు (ఆనంద్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రామలింగేశ్వరారెడ్డి, రామకృష్ణారెడ్డి) సహకారంతో 1997లో ఆలీ హీరోగా ఆషాడం పెళ్ళికొడుకు సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. తరువాత సుమన్, భానుప్రియ ప్రధాన పాత్రల్లో ఫిబ్రవరీ 14 నెక్లెస్ రోడ్డు పేరుతో సస్పెన్స్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఎం.ఎస్. రెడ్డి, టి. సుబ్బిరామి రెడ్డిల నిర్మాణంలో అందం అనే చిత్రాన్ని రూపొందించాడు. కానీ ఈ చిత్రం విడుదలకాలేదు.
ఆ తరువాత త్రినాధ్ పెదిరెడ్ల ద్వారా నిర్మాత ఎన్. సూర్యప్రకాశరావు పరిచయంతో 2005లో శివాజీ హీరోగా అదిరిందయ్యా చంద్రం సినిమాను రూపొందించాడు. 2006లో టాటా బిర్లా మధ్యలో లైలా, 2007లో మల్టీస్టారర్ సినిమా యమగోల మళ్ళీ మొదలైంది సినిమాలకు దర్శకత్వం వహించాడు. 2008లో బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ సినిమాకు దర్శకత్వం వహించాడు, ఇది విజయవంతంగా ప్రదర్శించబడింది.
సినిమాలు
- ఆషాడం పెళ్ళికొడుకు (1997)
- అదిరిందయ్యా చంద్రం (2005)
- టాటా బిర్లా మధ్యలో లైలా (2006)
- యమగోల మళ్ళీ మొదలైంది (2007)
- బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ (2008)
- కుబేరులు (2008)
- అ ఆ ఇ ఈ (2009)
- ఢమరుకం (2012)
- మామ మంచు అల్లుడు కంచు (2015)
- రాగల 24 గంటల్లో (2019)