Seetha DayakarReddy
Quick Facts
Biography
సీతాదయాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరపున దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం నుండి 2009లో ప్రాతినిథ్యం వహించింది.
జననం - విద్యాభ్యాసం
సీతాదయాకర్ రెడ్డి 1961, అక్టోబరు 27న కామినేని రాజేశ్వరరావు, భారతి దంపతులకు నిజామాబాద్ జిల్లా, సదాశివనగర్లో జన్మించింది. ఆర్.బి.వి.ఆర్.ఆర్. మహిళా కళాశాలలో ఇంటర్ (1977-79), బి.ఏ. (1979-82) చదివింది. 1982-84 మధ్యకాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. సోషియాలజీ చదివింది.
వివాహం - పిల్లలు
1984, ఫిబ్రవరి 3న కొత్తకోట దయాకర్ రెడ్డితో సీతాదయాకర్ రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు (సిద్ధార్థ, కార్తీక్).
రాజకీయరంగ ప్రస్థానం
సీతాదయాకర్ రెడ్డి 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించి 2001లో దేవరకద్ర జడ్పీటీసి సభ్యులుగా విజయం సాధించి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయింది. 2009లో కొత్తగా ఏర్పడిన దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున సీతాదయాకర్ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున స్వర్ణ సుధాకర్, భారతీయ జనతా పార్టీ నుండి భరత్ భూషణ్, ప్రజారాజ్యం పార్టీ తరఫున కె.ఎస్.రవి కుమార్, లోక్‌సత్తా పార్టీ తరఫున కృష్ణకుమార్ రెడ్డి పోటీ చేశారు. ప్రధానపోటీ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీతాదయాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి స్వర్ణ సుధాకర్ రెడ్డి పై 19034 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించింది.
2014 శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పోటీచేసిన ఆళ్ళ వెంకటేశ్వరరెడ్డి చేతిలో పరాజయం పొందింది.