S.Rajaram
Quick Facts
Biography
ఎస్.రాజారామ్ కర్ణాటక సంగీత విద్వాంసుడు, స్వరకర్త, నిర్వాహకుడు. ఇతడు ఆకాశవాణిలో 30 సంవత్సరాలు పనిచేసి, 1983లో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం డైరెక్టరుగా పదవీ విరమణ చేశాడు. భరతనాట్యం కొరకు వర్ణనలు, తిల్లానాలను స్వరపరిచాడు.
విశేషాలు
రాజారామ్ 1925లో మైసూరులో జన్మించాడు. ఇతడు మృదంగ వాద్యాన్ని డి.శేషప్ప, యల్లా సోమన్నల వద్ద అభ్యసించాడు. జలతరంగంను బి.దేవేంద్రప్ప వద్ద నేర్చుకున్నాడు. గాత్ర సంగీతాన్ని తన తాత మైసూరు వాసుదేవాచార్య వద్ద తర్ఫీదు పొందాడు. ఇతడు ఆకాశవాణిలో 30 సంవత్సరాలు పనిచేశాడు. 1983లో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం డైరెక్టరుగా ఇతడు పదవీ విరమణ చేశాడు. తరువాత 1984లో మద్రాసులోని కళాక్షేత్రలో ప్రిన్సిపాల్‌గా చేరాడు. 1995లో కళాక్షేత్ర ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా నియమితుడై 2005 వరకూ ఆ పదవిలో కొనసాగాడు. పదవీ విరమణ తరువాత బెంగళూరుకు తన మకాం మార్చాడు. ఇతడు స్వరకర్తగా కళాక్షేత్రలో అనేక నృత్య నాటికలకు సంగీతం సమకూర్చాడు. రామాయణం ఆధారంగా తయారైన 6 నృత్యనాటికలలో మొదటి మూడు నాటికలకు ఇతని తాత మైసూరు వాసుదేవాచార్య సంగీతాన్ని అందించగా మిగిలిన వాటికి ఇతడు బాణీలు కట్టాడు. ఇంకా ఇతడు భక్తి విజయం, భక్త జయదేవ, అక్క మహాదేవి, కర్ణ శపథం, శాకుంతలం, నాట్యవేద, కృష్ణ జననం మొదలైన నృత్యనాటికలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇతడు కళాక్షేత్ర ట్రూపుతో కలిసి ఐరోపా, రష్యా, ప్రాచ్య దేశాలలో విస్తృతంగా పర్యటించాడు. ఇతడు భరతనాట్యం కొరకు అనేక వర్ణనలను, తిల్లానాలను స్వరపరిచాడు.
ఇతడు అనేక పురస్కారాలను అందుకున్నాడు. 2001లో కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి నుండి సృజనాత్మక & ప్రయోజనాత్మక సంగీతం విభాగంలో అవార్డును స్వీకరించాడు.
ఇతడు 2009 జూన్ 1వ తేదీన తన 84వ యేట బెంగళూరులో మరణించాడు.