Rakshitha Suma
Quick Facts
Biography
తెలుగు సాహిత్యంలో అతిచిన్న వయస్సులోనే కవితా సంకలనాన్ని వెలువరచిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా మన్ననలు అందుకున్న చిన్నారి రక్షిత సుమ. తన 14వ ఏట దారిలో లాంతరు అనే కవితా సంకలనాన్ని తెలుగు ఇంగ్లీషు భాషలలో వెలువరించింది. వక్తగా, కథకురాలిగా కూడా తన ప్రయాణాన్ని సాగిస్తోంది.
జననం
కట్టా శ్రీనివాసరావు, మామిళ్ళపల్లి లక్ష్మి దంపతులకు జూలై 10, 2000 సంవత్సరంలో ఖమ్మం జిల్లా, సత్తుపల్లి గ్రామంలో జన్మించింది.
విద్యాభ్యాసం
ప్రాథమిక విద్యాభ్యాసం అశ్వారావుపేట మండలంలోని బిసి కాలనీ పాఠశాలలోనూ ఆ తర్వాత సత్తుపల్లి జ్యోతీ నిలయం, వి.వి.విద్యాలయంలలోనూ పూర్తిచేసుకుంది. వరంగల్లో ప్రాథమికోన్నత విద్యను, హైదరాబాదు సెయింట్ జాన్స్ పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేసుకుంది.
ప్రచురితమైన తొలి రచన
రక్షిత సుమ 4వ తరగతిలో వుండగానే తను మౌఖికంగా చెప్పిన చీమ మిడత అనే ఒక చిన్న కథ, రాజీవ్ విద్యామిషన్ బాలసాహిత్యం ప్రాజెక్టులో ఒకానొక కథావాచకంగా ప్రచురణకు ఎంపిక అయినది. తర్వాత కవిసంగమం అంతర్జాల వేదికపైన, భూమిక మాస పత్రికలోనూ కవితలు ప్రచురితం అయ్యాయి.
తొలి కవితా సంపుటి
13 వ ఏట నుంచి రాసిన 13 కవితల సమాహారంగా దారిలో లాంతరు అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పదమూడు కవితలను వేర్వేరు అనువాదకులు ఆంగ్లంలోకి అనువదించారు. కవి సంగమం వార్షికోత్సవం సందర్భంగా 2014 డిసెంబరు నెలలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన తమిళ కవయిత్రి రాజిత సల్మా గారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది.
కవితలు, రచనల జాబితా
తన రచనలు రక్షిత సుమ బ్లాగు లో లభ్యం అవుతాయి.
రక్షిత సుమ కవిత్వం పై యం నారాయణ శర్మగారి విశ్లేషణ
ఒక వస్తువునుంచి ప్రకృతిని వెదుక్కోవటం. ప్రకృతినించి వస్తువును చేరటం తొలినాళ్లలో రాసేవారికి ఒక కవిత్వీకరణ సూత్రం.ప్రాసను (ప్రాస కవిత్వ భాగమే ..కాని కేవలం ప్రాస గాదు) కవిత్వ మనుకోవటం అక్కడినుండే మొదలైంది. చాల కాలం క్రితం ఒక పదాన్నో, వాక్యాన్నో ఊనికగా తీసుకుని కవిత్వం రాసే వారు. నిర్వహణకోసం ఇదొక ప్రాతిపదిక మార్గం. నిజానికి కవితలో పద సమ్మేళనం ఒక భాగం. చలం గారికి ఈ అలవాటు ఎక్కువ. చాలామంది కవులు ఒక అచ్చుమీదో, పదం మీదో వొత్తిడి (Stress) తో కవిత్వం రాస్తారు .కవిత్వంలో వేగం (Swift) తేవడానికి ఇదో మార్గం. రక్షిత సుమ అడుగు అనే పదాన్ని ఊనిక చేసుకుని కవిత అందించారు. ఇది ఊనిక మాత్రమే. మంచి కవితాత్మకమైన వాక్యాలున్నాయి. పైన చెప్పుకున్న సూత్రం కూడా మంచి దర్శనాన్ని ప్రదర్శిస్తుంది.
“ | "పోగుబడ్డ ప్రపంచ విషయాలను పరిశీలనకు పుస్తకాన్నడుగు వెనక్కితిరిగి ఓ క్షణం పసితనాన్ని చూసి | ” |
'పోగుబడ్డ ప్రపంచ విషయాలు""వసివాడని సంతోషాలు""మసిబారని ఆలోచనలు"మంచి ప్రయోగాలు.ప్రేరణాత్మకంగా సాగే వచనం పఠనాసక్తినికలిగిస్తుంది.
“ | "వెలుగెక్కడుందని నీడనడుగు గమ్యాన్ని చేరేలా నడవాలంటే, | ” |
నిజానికి ఇందులో పై చివరివాక్యంలోని "అడుగే" కవితకు ఊనిక.ప్రశ్నించి తెలుసుకోడంలోనే అన్నీ సమకూరుతాయనే అంసాన్ని ప్రతిపాదిస్తూ ఈవాక్యాలు కొనసాగాయి.కొన్ని వాక్యాలు మంచి భారతని కూఒడా కలిగి కనిపిస్తాయి.
“ | "పరుగెత్తడమే కాదు పడకుండని తూకం కావాలి. ప్రవహించడమే కాదు పదునెక్కే ప్రగతి వుండాలి. " | ” |
పడకుండనితూకం, పదునెక్కె ప్రగతి ఆ భారతని కలిగిస్తాయి.మంచి కవిత రాసినందుకు అభినందనలు. కవిత్వానికి తనదైన ముద్ర రక్షిత సంపాదించుకోవాలి. తనదైన వాతావరణం కవితకి కావాలి. మరింత అధ్యయనం తోడైతే అది ఎంతో దూరంలోలేదు. నిజానికి అలాంటివాతావరణానికోసమే ఇవాళ కవిత్వం చూస్తున్నది. బహుశః కవిసంగమంకూడా ఇలాంటి తరంకోసం చూస్తుంది. మరిన్ని కవితలు "వడి"గా రక్షితనించి కోరుకుంటున్నాను.
శ్రీరామోజు హరగోపాల్ గారి విశ్లేషణ
కవిసంగమం ‘కవిత్వపండుగ’లో కవిత్వపు ‘దారిలో లాంతరు’ ఆవిష్కరించబడిందివాళ ...
మా చిన్నారి కవయిత్రి రక్షితసుమ కవిత్వం రాయడం బాగుంది. కవిత్వం మీద ప్రేమతో రాసింది బాగుంది. కవితావస్తువులు తన వయసును మించిన జ్ఞానంతో ఎన్నుకుంది బాగుంది. ఎక్కడా బాల్యచాపల్యం కనిపించదు. చాలామంది ఇపుడు రాస్తున్నామనుకున్న కవిత్వం కన్నా బాగుంది సుమకవిత్వం. తెలుసుకోవాల్సిన ఎరుక తనకిపుడే కలగడం విశేషం. పిల్లలు చాలా గొప్పగా కవితలు రాయడం తెలుసు. వాళ్ళతో కవిత్వం రాయించిన టీచర్ గా నేను అపూర్వమైన అనుభూతిని పొందాను. రక్షితసుమ కవితలు చదివాను.విన్నాను. నెలనెలా కవిసంగమం కార్యక్రమంలో నాతో మిగతా కవులతోపాటు తాను కవయిత్రిగా పాల్గొన్ననాడే తన భావుకత, వ్యక్తీకరణశైలినచ్చి మురిసిపోయాను.
బంగారానికి తావి అబ్బినట్లుగా తన కవిత్వం ఆంగ్లంలోకి అనువదించబడడం చాలా బాగుంది.అనువాదకులు ఆ చిన్నారి మీద చూపిన అపారమైనప్రేమ, చేసిన అనువాదాలు అద్భుతంగా ఉన్నాయి. శిలాలోలిత గారి పీఠిక, శర్మగారి సమీక్ష, చాలామంది కవుల, కవయిత్రుల మాటలు మా రక్షితసుమకు ఎంతో భవిష్యత్తును వాగ్దానం చేసాయి.ఆమెలో కవయిత్రిని స్థాపించారు. చిన్నపిల్ల చిట్టిపొట్టి కవితలు రాసుకోక ఎంత గడుసుగా రాసిందనిపిస్తుంది తన కవితలు చదువుతుంటే.....చందమామను అందాలమామ అంటే సరిపోదా? పండుగల తొలి అతిథి అని, పగలసెగల నెరుగడని, వెన్నెలసహనం ఇవ్వమనడం ఏ కవులకు తక్కువ... వెన్నెలసహనం అనే పదం తనకు తట్టడమే తన ఆలోచనల సాంద్రత ఎంతుందో తెలిసిపోతుంది. Chant poor little thing అని తోరుదత్ తన vocation కవితలో అన్నట్లు సుమ కవిత్వాన్ని అభినందించాలి మనం.
కవిత్వాన్ని కవులు తమ నిత్యజీవితంలోంచే ఎన్నుకుంటారు కదా. జీవనశైలిని కవిత్వంలోనికి అనువదించడంలో కవుల సఫలతే వారి కవిత్వానికి గీటురాయి కదా. మా చిట్టికవయిత్రి సుమ ‘అవిజ్ఞులు’ అనే కవితలో వస్తువును కవితాసామగ్రితో ప్రతిభావంతంగా అనుపమానంగా రచించింది.
“ | ‘ మీ రెండు సిమ్ముల సోల్ లో భక్తి బాలన్సుంటే...... | ” |
అంటుంది....రెండు సిమ్ముల సోల్ అట...మనుషుల ద్వంద్వప్రవృత్తిని కడిగిపారేసింది. అమ్మో, చిన్న రాతలో పెద్దమాట.
ప్రశ్నలు, జవాబుల రూపంలో చెకుముకి రాయిలో ‘పనిలోనికి మారనిదే జ్ఞానానికి విలువేది’? అంటూ రాసింది. ‘పిల్లవాళ్ళకు చాలు’ కవితలో ‘కాస్త ప్రపంచంతో కుస్తీలుపట్టడం కూడా నేర్పండయ్యా సార్లూ’ అంటూ గురువులకే ప్రశ్నోపనిషత్తునిచ్చింది.
“ | ‘అడుగులు’ వేస్తూ ‘పరుగెత్తడమే కాదు పడిపోని తూకం కావాలి ప్రవహించడమే కాదు పదునెక్కే ప్రగతి వుండాలి’ | ” |
అంటుందీ కవయిత్రి. ఎవరు చెప్పారయ్యా తనకు పడిపోని‘తూకం’ ఎట్లుంటుందో...తనకీ దర్శనజ్ఞానం గురించి ‘ఈనాటి కవిత’లో గొప్పగా సమీక్షించారు నారాయణశర్మగారు..అది రక్షితసుమ ప్రతిభా వ్యుత్పత్తి. తనకు ఉజ్జ్వలమైన భవిష్యత్తుంది.మానవతాదృక్పథం నిండిన మనీషితత్వాన్ని తనకవిత్వంగా రచిస్తుందన్ననమ్మకం కలిగింది నాకు.
కొత్తచీకట్లు కవితలో ఇట్లా రాస్తుంది తను
“ | ‘అప్పుడు లాంతరున్నవాడిదే రాజ్యం ఇప్పుడు లాంతరున్న చోట ఉండదు రాజ్యం’ | ” |
...ఎందుకంటే అన్ని లాంతర్లు ‘ ఆజ్ఞా కీజియే మేరే హాకా’ అనవు.మనిషినే లేకుండా చేస్తాయి.అందుకే కొన్ని లాంతర్లతో జాగ్రత్త. కాని ఈ ‘దారిలో లాంతరు’ను జాగ్రత్తగా పట్టుకుని నడవండి కొత్త కవితాలోకంలోకి....రండి.
పగిడిపల్లి వెంకటేశ్వర్లు గారి విశ్లేషణ
రక్షిత సుమ కవిత్వాల కుసుమ
మట్టివేళ్ళతో పుట్టిన మల్లె మొక్క రక్షిత సుమ,
పరిమళించే కుసుమాల సుమ దారిలో లాంతరు పట్టుకుని కవిత్వ వీధుల్లో ఆమె అడుగులు పండువెన్నెల కోసం వెతుకుతున్నాయి.
ఆమె మెదడు చెకుమముకి రాయికాదు. కవిత్వాలకెపాసిటర్ కాబట్టే ప్రపంచంలో కుస్తీలు పట్టడానికి సిధమౌతున్నది.
ఆమెను గడ్డిపోచ అనుకోకు, అవిజ్ఞుల కొత్త చీకట్లు పారదోలే డైనమైట్.
కానీ యిప్పుడు ప్లాస్టిక్ చిక్కుముడుల మధ్య దిక్కుతోచక చిక్కుకుపోయి
తలకూడ బయటపెట్టలేకపోతున్న చెట్టును గుర్తించి, విషవాయువుల పొగల ఆవిరులలో చిక్కి ఒక్కచుక్కగానైనా రాలలేకపోతున్నది చినుకులను ఒడిసిపట్టుకోవాలని, కొలిమిలా మండుతున్న మనస్సుతో రాయనేర్చిన హరితవాది.
వేషం, భాష వేరేమో కాని అందరం భూమి తల్లి పిల్లలమే అని చాటగల్గిన సమతావాది.
“ | చదవనిదే మనిషికేల జ్ఞానం మదికెక్కుతుంది? చెక్కనిదే రాయి యెలా శిల్పమై నిలుస్తుంది? | ” |
అంటున్న సుమ కవిత్వంలో
పెద్దలు సి.నారాయణరెడ్డి శైలిని, వేమన తత్త్వాన్ని ఆవగాహనతో ఆవాహన చేసికొని పలికిందా అన్నట్లుండే దృష్ఠాంతలు మనలను ఆశ్చర్య చకితులను చేస్తాయి. చివరిగా అఘోరనాథ్ చటోపాధ్యాయకు సరోజీనాయుడు, నాయని సుబ్బారావుకు కృష్ణకుమారి, కేతవరపు రామకోటి శాస్త్రికి కాత్యాయనీ విద్మహే సమకూరినట్లు కట్టా శ్రీనివాసుకు రక్షిత సుమ సారస్వత వరప్రసాదమేమో అని అనిపించక మానదు . మరిన్ని సుమాలతో మరొక కవిత్వ పూల హారం వెలువరించాలని కోరుకుంటాను. పగిడిపల్లి వెంకటేశ్వర్లు - ఖమ్మం ( బయ్యారం కాలేజి తెలుగు లెక్చరర్)
పురస్కారాలు
2015 సంవత్సరానికి గానూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ చిన్నారి కవయిత్రిని జి.కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారంతో సన్మానించింది.
యాంకర్ గా
అనగనగా కథలు అప్లికేషన్ లాంచ్ సందర్భంగా రవీంద్ర భారతి లో నిర్వహించిన ప్రారంభ సమావేశంలో తనికెళ్ళ భరణి, రాజీవ్ కనకాల వంటి పెద్దల సమక్షంలో కార్యక్రమ వ్యాఖ్యతగా వ్యవహరించింది.
కవిసంగమం ఫేస్ బుక్ సమూహం నెలవారీగా నిర్వహించుకునే కవితో ఒక సాయంత్రం కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. పాఠశాల ప్రత్యేక కార్యక్రమాలు, వార్షికోత్సవాలలో కూడా వ్యాఖ్యాతగా తన ప్రతిభను చూపింది.
చిత్రమాలిక
- కవిసంగమం వేదికపై
- రచయిత్రులతో రక్షిత సుమ
- హైదరాబాద్ పుస్తకప్రదర్శనలో తనికెళ్ల భరణి గారితో రక్షిత సుమ
- పాఠశాలలో రక్షిత సుమకి సన్మానం