Rakesh Master
Quick Facts
Biography
రాకేష్ మాస్టర్ (1968 - 2023 జూన్ 18) భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. దాదాపు 300 సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. ఆయన అసలు పేరు ఎస్. రామారావు.
2020 సంవత్సరంలో గ్లోబల్ హ్యమన్ పీస్ యూనివర్సిటీ వారు సేవా రంగంలో రాకేష్ మాస్టర్‌కు డాక్టరేట్ ప్రకటించారు.
జీవిత విషయాలు
ఎస్. రామారావు 1968వ సంవత్సరంలో తిరుపతి ప్రాంతంలో జన్మించాడు. ఈయనకు నలుగురు అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. హైదరాబాద్‌లో ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం పనిచేశాడు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి వారికి శిక్షణ ఇచ్చాడు. వేణు, మణిచందన, ప్రభాస్, ప్రత్యూష మొదలైన సినీ నటులు రాకేష్ మాస్టర్ వద్ద శిక్షణను పొందారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు మొదలైన సినిమాలలోని పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే ఈటీవీ వేదికగా ప్రారంభమైన డ్యాన్స్ షో ఢీ లో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్‌గా వ్యవహరించాడు అదే విధంగా జబర్దస్త్ కామెడీ షోకి సంబంధించి పలు ఎపిసోడ్లలో పార్టిసిపెంట్‌గా కూడా పాల్గొన్నాడు ఆయన చాలామందికి సహాయం చేశారు
వివాదాలు
యూట్యూబ్ వేదికగా రాకేష్ మాస్టర్ అనేక వివాదాస్పద ఇంటర్వ్యూలు ఇచ్చాడు. రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి, ఎన్టీఆర్, బాలకృష్ణ, మోహన్ బాబు, చిరంజీవి, మంచు లక్ష్మిలను టార్గెట్ చేస్తూఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. అలాగే పుల్లయ్య అనే పల్లెటూరి కుర్రాడికి రాకేష్ మాస్టర్ డ్యాన్స్‌లో కొన్నాళ్లు శిక్షణ ఇచ్చాడు. కానీ ఆ కుర్రాడు ఆ శిక్షణను మధ్యలోనే ముగించి, తన మాస్టర్ పైనే వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వార్త సోషల్ మీడియాలో సంచలనాన్ని రేకెత్తించింది. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూశ్రీకృష్ణుడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని చెబుతూ యాదవ సంఘ నాయకులు రాకేష్ మాస్టర్ పై మే 2021 నెలలో హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరణం
రాకేశ్ మాస్టర్ విశాఖలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొని హైదరాబాద్ తిరిగొచ్చిన తరువాత అస్వస్థతకు గురై 2023 జూన్ 18న మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వగా, డయాబెటిస్ పేషెంట్ కావడంతో పాటు సివియర్ మెటాబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ జరగడంతో పరిస్థితి విషమించి సాయంత్రం 5 గంటలకు మరణించాడు.