Pattipaka Mohan
Quick Facts
Biography
పత్తిపాక మోహన్, తెలంగాణకు చెందిన బాల సాహితీవేత్త, కవి, సాహిత్య విమర్శకుడు. నేషనల్ బుక్ ట్రస్ట్ హైదరాబాదు ప్రాంతీయ సంపాదకుడిగా పనిచేస్తున్నాడు. ‘బాలల తాత బాపూజీ’ గేయ కథకు కేంద్ర సాహిత్య అకాడమీ 2022 బాలసాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు.
జీవిత విశేషాలు
పత్తిపాక మోహన్ 1972, జనవరి 5న గంగాబాయి - లక్ష్మీరాజం దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలంలోని లింగంపేట గ్రామంలో జన్మించాడు. వారి కుటుంబం పూర్వీకుల నుండి చేనేత వృత్తిని చేసేవారు. తొలినాళ్ళలో చేనేత నేపథ్యంలోనే కవిత్వం రాశాడు. తెలుగు సాహిత్యంలో ఎంఏ, పీహెచ్ డీ చేశాడు. 'తెలుగులో గజల్ ప్రక్రియ - సమగ్ర పరిశీలన' అనే అంశంమీద తొలి పరిశోధన చేశాడు. 1998- 2001 వరకు కొమురంభీం జిల్లా సిర్పూర్ సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశాడు.
వ్యక్తిగత జీవితం
మోహన్ కు సిరిసిల్ల చందనతో వివాహం జరిగింది. చందన ఎస్సీఈఆర్టీలో హిందీ భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నది.
సాహిత్య ప్రస్థానం
చిన్నతనం నుండి మోహన్ కు సి. నారాయణరెడ్డితో సన్నిహిత సంబంధాలుండేవి. ప్రతి పుట్టినరోజుకు హన్మాజీ పేటకు వెళ్ళి సినారేను కలిసేవాడు. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుడు టంకశాల దేవదాసరావు తెలుగు గురువు. ఏడో తరగతిలోనే మోహన్, ఓటుపై ఒక కవిత రాసి గురువుల మెప్పును పొందాడు. విద్యార్థి దశలోనే పాఠశాల, కళాశాలల్లో వ్యాఖ్యాతగా కూడా పేరు తెచ్చుకున్నాడు.
రచయితగా సుమారు 15 పుస్తకాలు రాసాడు. అతను వివిధ భాషల్లోని కథలు తెలుగులోకి అనువాదం చేశాడు. ‘ముత్తుకలలు’ తోకలు, మంచి విత్తులు, టిప్పు సుల్తాన్, ప్రాణ స్నేహితులు మొ॥వి తెలుగులోనికి అనువదించాడు. 14 బాల సాహిత్య సంకలనాలు, 28 బాలసాహిత్య అనువాదాలు, ఖడ్గధార, సముద్రం తదితర రచనలు సహా పలు సంకలనాలకు సంపాదకత్వం వహించాడు. 2001లో చేనేత కార్మికుల ఇతివృత్తంతో 40 పేజీల దీర్ఘ కవితను రాసి, చేనేత కవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కవిత్వంలో విశేష ప్రాచుర్యం పొందిన నానీల ప్రక్రియలోనూ 2009లో కఫన్ (శవంపై కప్పే గుడ్డ) పేరుతో కవిత్వీకరించాడు. మానేరు రచయితల సంఘం వ్యవస్థాపకుడిగా పనిచేశాడు.
రచనలు
- 'ఆకుపచ్చని పాట': ఇది స్వచ్చ సర్వేక్షణ్‌లో భాగంగా పిల్లలకు పర్యావరణ స్పృహను తెలిపే 'బాలగీత'
- 'ఒక్కేసి పువ్వేసి చందమామ': ఇది బాలల బతుకమ్మ గేయాల సంకలనం.
- చందమామ రావే: బాలల గేయాల పుస్తకం
- పిల్లలకోసం మనకవులు
- సహస్ర భాగవత సప్తాహదీప్తి
- వెన్నముద్దలు
- అఆ ఇఈ
పురస్కారాలు
తెలుగు సాహిత్యంలో కృషిచేస్తున్న మోహన్ పలు పురస్కారాలు, సత్కారాలను అందుకున్నాడు.
- కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారం (2022): 2022 నవంబరు 14న ఢిల్లీలో జరిగిన సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా. చంద్రశేఖర్ కంబారా చేతులమీదుగా అవార్డు అందుకున్నాడు. పురస్కారంతోపాటు 50వేల రూపాయల చెక్కు, తామ్రపత్రాన్ని అందించారు.
- డా.వేదగిరి రాంబాబు బాల సాహిత్య పురస్కారం (2018 అక్టోబరు 14)
- డా. మంగాదేవి బాలసాహిత్య పురస్కారం (2017)
- తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సాహిత్య పురస్కారం (2017)
- కాళోజీ స్మారక సాహితీ పురస్కారం (2016)
- రంజని కుందుర్తి ఉత్తమ కవితా పురస్కారం (2015)
- బాల పురస్కారం (2011)
- తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం (2009)
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మొదటి యువ విశిష్ట సాహిత్య పురస్కారం (1997)
మూలాలు
బయటి లంకెలు
- AKASHVANI ADILABAD 100.2 FM. (2017-10-23), “జీవన ప్రయాణం, సాహిత్య వ్యాసంగం” - డా.పత్తిపాక మోహన్, retrieved 2018-10-21
{{citation}}
: CS1 maint: numeric names: authors list (link) - Nadadhur, Srivathsan (2018-05-31). "Writing books for children isn't easy, says author Mohan Pathipaka". The Hindu. ISSN 0971-751X. Retrieved 2018-10-21.