Mokkapati Krishnamurthy
Quick Facts
Biography
మొక్కపాటి కృష్ణమూర్తి చిత్రకారుడు, శిల్పి, రచయిత. ఈయన ప్రజ్ఞ బహుముఖం. కేవలం చిత్రకళలోనే కాక శిల్పరంగంలోనూ రచనా రంగంలోనూ కూడా మంచి ప్రజ్ఞ కనబరచాడు.
జీవిత విశేషాలు
ఈయన పశ్చిమ గోదావరి జిల్లా,పెదపాడు మండలానికి చెందిన వసంతవాడ గ్రామంలో 1910లో జన్మించాడు. ఇతని కుటుంబం కవులు, కళాకారులకు పుట్టినిల్లు. మద్రాసులోని స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చేరి దేవీ ప్రసాద్ రాయ్ చౌదరి వద్ద చిత్రలేఖనంలో శిక్షణ పొందాడు. ఇతని చిత్రాలను ప్రధానంగా లినోకట్స్, ప్రకృతి దృశ్యాలు, పల్లెటూరి జీవన దృశ్యాలు, ప్రాచీన గాధలకు రూపకల్పన చేసిన చిత్రాలుగా నాలుగు విభాగాలుగా విభజించవచ్చు. ఇవికాక ఎన్నో రేఖాచిత్రాలు గీశాడు. ఇతని చిత్రకళ దాదాపు సాంప్రదాయక పద్దతిలోనే సాగినా ఇతడు ఆధునిక కళా సాంప్రదాయాలన్నింటినీ ఆకళింపు చేసుకున్నాడు. పాశ్చాత్య చిత్రకళా రీతులపై, సిద్ధాంతాలపై లోతైన అధ్యయనం చేసి వాటిలోని మార్పులను, ధోరణులను వివరిస్తూ అనేక విలువైన వ్యాసాలను రచించి ప్రచురించాడు.ఇతని చెల్లెళ్లు సీతాదేవి, పి.విజయలక్ష్మి, కె.స్వరాజ్యలక్ష్మి కూడా చిత్రకారిణులే.
ఇతడు తన 52వ యేట 1962, మే 6వ తేదీన మరణించాడు.
ముఖ్యమైన చిత్రాలు
ఈయన చిత్రాలలో గుర్తింపు పొందినవి కొన్ని:
- వరూధిని
- పురిటాలు
- మడినీళ్లు
- ఊరిబయట
- స్నానసుందరి
- సంధ్యార్చన
- మాతృమూర్తి
- రతీమన్మధ
- భిక్షాటనమూర్తి
రచనలు
ఇతడు చిత్రకళకు సంబంధించిన వ్యాసాలు, ఇతర రచనలు ఆంధ్రపత్రిక, భారతి వంటి పత్రికలలో ప్రచురించాడు.
ఇతని రచనలు కొన్ని:
- ఆంధ్రులు వారి చిత్రకళ - వ్యాసం - ఆంధ్రపత్రిక సర్వజిత్తు సంవత్సరాది సంచిక - 1948
- అవనీంద్ర స్మృతి - పద్యం - భారతి - ఫిబ్రవరి 1952
- తొలి ఇటలీ చిత్రకారులు - వ్యాసం - భారతి - మే 1953
- చిత్రకళలో విప్లవం తెచ్చిన వాన్‌గో - వ్యాసం - భారతి - జనవరి 1960
- పాశ్చాత్య చిత్రలేఖనంలో పరిణామాలు - వ్యాసం - పరిశోధన
ఇవి కాక ఇతడు చిత్రించిన భాగవత చిత్రాలను వజ్ఝ శ్రీనివాస శర్మ సేకరించి 1969లో లలితకళా అకాడమీ తరఫునభాగవత ఇలస్ట్రేషన్ అనే ఆంగ్ల గ్రంథాన్ని ప్రచురించాడు.