M.V.Gangadhara Siva
Quick Facts
Biography
ఎం.వి.గంగాధర శివ పార్లమెంటు సభ్యుడు, రాజకీయనాయకుడు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఇతడు కృషిచేశాడు.
జీవిత విశేషాలు
గంగాధర శివ 1898 డిసెంబరులో కడప పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు ఎం.వరదరాజులు. ఇతని ప్రాథమిక విద్య కడప మునిసపల్ హైస్కూలులో నడిచింది. తర్వాత ఉన్నత విద్యను మద్రాసులోని వెస్లీ కళాశాలలో పూర్తిచేశాడు. ఇతడు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనరుగా ప్రజలకు వైద్యసేవలను అందించాడు. 1935లో నాగమణితో ఇతని వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కలిగాడు.
ప్రజాజీవితం
ఇతడు కడప మునిసపల్ కౌన్సిలర్‌గా పనిచేశాడు. ఇతడు జిల్లాబోర్డు సభ్యుడిగా, ప్లానింగ్ కమిటీ సభ్యుడిగా, ప్రొహిబిషన్ కమిటీ సభ్యుడిగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనెట్ సభ్యుడిగా, ఇ.ఎస్.ఐ.కార్పొరేషన్ సభ్యుడిగా, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సభ్యుడిగా, కేంద్ర ఆరోగ్య సలహా కమిటీ సభ్యుడిగా, వాణిజ్య పారిశ్రామిక సలహా కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. జిల్లా విద్యాబోర్డుకు ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. ఈ పదవి పొందిన తొలి షెడ్యూలు కులానికి చెందిన వ్యక్తి ఇతడే. 1926-31 మధ్య కాలంలో మద్రాసు శాసనమండలి సభ్యునిగా ఉన్నాడు. 1950లో ఏర్పాటయిన తాత్కాలిక పార్లమెంటులో సభ్యుడిగా ఉన్నాడు. మొదటి లోక్‌సభ (1952-57), రెండవ లోక్‌సభ (1957-62)లకు చిత్తూరు (ఎస్.సి. రిజర్వుడు) నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. దత్తమండల అణగారిన వర్గాల సంఘా(Ceded District Depressed Class Association)నికి ఇతడు వ్యవస్థాపక అధ్యక్షుడు. 1931లో ఇతడు సైమన్ కమీషన్ ముందు సమిష్టి నియోజకవర్గానికి అనుకూలంగా సాక్ష్యం ఇచ్చాడు. రాజా-మూంజే ఒడంబడికపై సంతకాలు చేసినవారిలో ఇతడు కూడా ఉన్నాడు. 1932 కమ్యూనల్ అవార్డును ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ ప్రతినిధిగా ఇతడు వ్యతిరేకించాడు.