Kolavennu Malayavasini
Quick Facts
Biography
కోలవెన్ను మలయవాసిని తెలుగు రచయిత్రి, అధ్యాపకురాలు, ఉపన్యాసకురాలు.
జీవిత విశేషాలు
ఆమె ఆండ్ర శేషగిరిరావు, చింతామణి దంపతులకు 1944 అక్టోబరు 8న జన్మించింది. ఆమె తండ్రి శేషగిరిరావు ఆంధ్ర భూమి, ఆంధ్ర కీర్తి, ఆనందవాణి, గృహలక్ష్మి, ప్రజా మిత్ర లాంటి పత్రికలకు సంపాదకునిగా వ్యవహరించాడు. ఆమె 1964లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆనర్స్ చేసింది. తరువాత ఆమె ఎంఎ కోర్సుల్లో ప్రథమ శ్రేణిలో నిలిచింది. ఆమె 1965-66లో విజయవాడ మారిస్‌స్టెల్లా స్త్రీల కళాశాలలోనూ, 1970-71లో రాజమండ్రి కందుకూరి రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాలలోనూ, 1975-86లలో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ నందు అధ్యాపకురాలిగానూ, 1986-1990లలో ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌లో రీడర్‌గానూ, 1990 నుంచి ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు శాఖలో ప్రొఫెసర్‌గానూ పనిచేసింది. 1971 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తత్త్వ శాస్త్రంలొ డాక్టరేట్ పొందింది. ఆమె యు ఎన్ ఎ లో 1982లో విజిటింగ్ లెక్చరర్‌గానూ, అదే దేశంలో విస్‌కాంపన్ యూనివర్సిటీలో విజిటింగ్ లెక్చరర్‌గానూ పనిచేసింది. అంతేకాక ఆమె పరిపాలన బాధ్యతలను కూడా తీసుకున్నాదొ. 1988 నుంచి 1991 వరకు తెలుగు శాఖాధ్యక్షులుగాను, 1991 నుంచి 1994 వరకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ అధ్యక్షులుగాను పని చేసింది. 1997 నుంచి 2000 వరకు డీన్ ఓరియంటల్ లెర్నింగ్‌లలో బాధ్యతలను నిర్వహించింది. అంతేకాక ఆమె మెంబర్ బోర్డ్ ఆఫ్ స్టడీస్‌గా కొన్ని విశ్వ విద్యాలయాలలో విద్యావ్యాప్తికి కృషి చేసింది. వీటిలో ఉస్మానియా విశ్వ విద్యాలయం (హైదరాబాద్), శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం (తిరుపతి), బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం, కాకతీయ విశ్వ విద్యాలయం (వరంగల్) బెరహంపూర్ విశ్వ విద్యాలయం, చంబల్‌పూర్ విశ్వ విద్యాలయం, కల్లికోట కాలేజీ బెరహంపూర్, సెయింట్ టెరిన ఉమెన్స్ కాలేజీ (ఏలూరు), సెయింట్ జోసఫ్ ఉమెన్స్ కాలేజీ (విశాఖ), ఎంఆర్ కాలేజీ (విజయనగరం) మహారాణి కాలేజీ (పెద్దాపురం) తదితరాలు ఉన్నాయి.1992-95 లలో బోర్డ్ స్టడీస్ కు చైర్ పర్సన్ గానూ పనిచేసారు. ఆమె 60 రేడియో చర్చలను ప్రసారం చేశారు.
ముద్రిత రచనలు
- ఆంధ్ర జానపద సాహిత్యము - రామాయణము.
- ఆంధ్ర వాఙ్మయము- రామాయణము
- వివిధ భారతీయ భాషలలో రామాయణము
- శ్రీ రామ నవమి (వ్యాససంపుటి)
- పువ్వులు- మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (బహుమతి పొందినది)
- ఆంధ్ర కవయిత్రులు - ఆంధ్రవిశ్వకళాపరిషత్ ప్రచురణ
- ఆంధ్ర బాలల కవితా వినోదిని
- ఆంధ్రసాహిత్య చరిత్ర (బాలలకోసం)
- భారతవాణి (వ్యాసపీఠం ఉపన్యాసాలు)
- పౌరాణిక పురంద్రులు (టి.టి.డి. ముద్రణ)
- మన పుణ్యనదులు,
- ఓ రామా ! నీ నామమేమిరుచిరా
- మలయమారుతం,
- శారదా విపంచి
- రామాయణ రహస్యాలు
- తెలుగులో తిట్టు కవిత్వం
వీరి రచన 'పువ్వులు' మినిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ భారత ప్రభుత్వ బహమతి పొందింది.
పురస్కారాలు
ఆమె ప్రతిభకు ఎన్నో సాహితీ సంస్థలు పురస్కారాలను, సత్కారాలను అందించాయి.
- ఆంధ్రవిశ్వవిద్యాలయం 1990లో అందించిన ఉత్తమ పరిశోధక పురస్కారం
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1990లో ఇచ్చిన ఉత్తమ అధ్యాపక పురస్కారం
- 1999లో శ్రీకాకుళం మహతి సాహితీ పురస్కారం,
- 1999లో విశాఖ కూరెళ్ల సాహితీ పురస్కారం
- 2000లో భీమవరం హుసేన్ షా సాహితీ పురస్కారం
- 2000లో ఢిల్లీలో తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం
- 2001లో విశాఖ ఫైనార్ట్ అకాడమీ పురస్కారం
- 2001లో విశాఖ అధికార భాషా సంఘం పురస్కారం
- 2002లో లయన్స్ క్లబ్ నేటి మహిళా పురస్కారం
- 2003లో తిరుపతి అధికార భాషా సంఘం పురస్కారం
- 2003లో తెలుగు విశ్వ విద్యాలయం పరిశోధన ప్రతిభ పురస్కారం.
- 2015 విజయభావన సాహితీ పురస్కారం
- 2016 : అన్నపూర్ణ జ్ఞాపక పద్య కవితా పురస్కారం