Duggirala Balaramakrishnayya
Quick Facts
Biography
దుగ్గిరాల బలరామకృష్ణయ్య స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. ఇతనికి 'బౌద్ధ వాఙ్మయబ్రహ్మ ' అనే బిరుదు వుంది. లోక్‌సభ సభ్యులుగా పనిచేసాడు.
జననం, విద్య
దుగ్గిరాల బలరామకృష్ణయ్య కృష్ణా జిల్లాలోని అంగలూరు గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో దుగ్గిరాల అమరయ్య దంపతులకు 1905 లో జన్మించాడు. మచిలీపట్నం నేషనల్ కాలేజిలో చదివాడు. తెలుగు, సంస్కృతం, హిందీ సాహిత్యాన్ని అభ్యసించాడు. అతనికి బెంగాలీ, గుజరాతీ, ఉర్దూ భాషల్లో కూడా ప్రావీణ్యం ఉంది. అలహాబాద్ లోని హిందీ విద్యాపీఠంలో మూడు సంవత్సరాలు చదువుకున్నాడు. ఇతనికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
స్వాతంత్ర పోరాటం
గాంధీజీ పిలుపు అందుకొని చదువును మధ్యలోనే వదిలి కాంగ్రెసు పార్టీ వాలంటీరుగా చేరాడు. సహాయనిరాకరణ ఉద్యమంలో 1919లో జైలుకు వెళ్ళాడు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ సందర్శనకు వ్యతిరేకంగా నల్లజెండాలతో ప్రదర్శనను చేపట్టినందుకు బలరామకృష్ణయ్యను 1921 లో అలహాబాద్‌లో అరెస్టు చేసారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో భార్య, కుటుంబసభ్యులతో కలసి పాల్గోని చెరసాలకు వెళ్ళారు. ఆతరువాత 1934లో వ్యక్తిగత సహాయనిరాకరణ చేసి 9 నెలలు జైలులో గడిపాడు. "క్విట్ ఇండియా ఉద్యమం" సందర్భంగా అతన్ని వెల్లూర్, టాంజోర్ జైళ్ళలో 1942 సెప్టెంబరు 10 నుండి 1944 డిసెంబరు 9 వరకు (రెండు సంవత్సరాల 4 నెలలు) అదుపులోకి తీసుకున్నారు.
ఇతను సంఘ సంస్కర్త. వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. అంటరానితనం తొలగించడానికి కృషి చేశాడు. ఆచార్య ఎన్. జి. రంగాతో కలసి కృష్ణా జిల్లాలో రైతు ఉద్యమంలో పనిచేశాడు.
రాజకీయ జీవితం
బలరామకృష్ణయ్య 5 సంవత్సరాలు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో సభ్యునిగానూ, ద్వితీయ లోక్‌సభలో సభ్యునిగా పనిచేసాడు.
1957లో జరిగిన భారతదేశ 2వ సార్వత్రిక ఎన్నికలలో గుడివాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ తరపున పోటీ చేసి సమీప కమ్యూనిస్ఠు పార్టీ అభ్యర్థి పై విజయం సాధించాడు. అతనికి 155873 ఓట్లు రాగా, ప్రత్యర్థికి 128253 ఓట్లు వచ్చాయి.
సాహిత్య సేవ
1925 లో హిందీ భాషా ప్రచారంలో పాల్గొన్నాడు. గ్రంథాలయ ఉద్యమంలో అనేక సమావేశాలకు అధ్యక్షత వహించాడు. అతని అధ్వర్యంలో అనేక సాహిత్య సమావేశాలు జరిగాయి. 1927 లో సర్వేపల్లి రాధా కృష్ణన్ అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభ "బౌద్ధమతం" పై చేసిన విశిష్టమైన కృషికి అతనికి "బౌద్ధ వాఙ్మయబ్రహ్మ" అనే బిరుదును ప్రదానం చేసింది. అతను 15 పైగా గ్రంథాలను రచించాడు.
రచనలు
- తెలుగు సీమ
- మానవ జీవితము
- గాంధీ గీత
- బుద్ధ పురాణము
- ఆత్మవిజయము
- శ్రీకృష్ణ వేణువు
- నిష్కామయోగము
- సర్వోదయము
- దండియాత్రా ప్రవచనములు