Charan Arjun
Quick Facts
Biography
చరణ్ అర్జున్ తెలుగు సినిమా సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. 2003లో వచ్చిన ఆయుధం సినిమాలోని ఇదేమిటమ్మా మాయా మాయా పాటతో పాటల రచయితగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు.
జీవిత విషయాలు
చరణ్ అర్జున్ అక్టోబర్ 23న కొండేటి మల్లేష్, గోపమ్మ దంపతులకు నల్లగొండ జిల్లా, మేళ్ళదుప్పలపల్లి గ్రామంలో జన్మించాడు. పాఠశాల విద్యను ఊరిలోనే పూర్తిచేశాడు. ఇంటర్ తరువాత హైదరాబాదు తెలుగు విశ్వవిద్యాలయంలోని సంగీత శాఖలో డిగ్రీ డిప్లొమా కోర్సులో చేరి, మధ్యలోనే వదిలేసి ప్రాక్టికల్ మ్యూజిక్ కు వెళ్ళాడు.
పాటల రచయితగా
తొలి సినిమా
చరణ్ స్కూల్లో ఉన్నప్పటి నుంచే పాటలు రాస్తుండేవాడు. ఆ పాటలు చూసిన అరుణ మేడం చరణ్ ను ప్రోత్సహించి, స్కూల్లో జరిగే కార్యక్రమాలకు పాటలు రాయించింది. అలా చరణ్ రాసిన ఒక పాటకు ‘జన్మభూమి’ రాష్ట్రస్థాయి అవార్డు వచ్చింది. సినీ దర్శకుడు ఎన్.శంకర్ చరణ్ పాటల గురించి తెలుసుకొని సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ కు పరిచయం చేశాడు. అలా 2003లో రాజశేఖర్ హీరోగా వచ్చిన ఆయుధం సినిమాలో ఇదేమిటమ్మా మాయా మాయా అనే పాటను రాసి 18 ఏళ్ల వయసులోనే చిన్ని చరణ్‌గా సినిమా రంగంలో అడుగు పెట్టాడు.
తరువాతి అవకాశాలు
మొదటి పాటతోనే మంచి గుర్తింపు రావడంతో డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేసి చెన్నై వెళ్లి మణిశర్మ, యువన్ శంకర్ రాజా తదితర సంగీత దర్శకుల దగ్గర కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో లారెన్స్ పరిచయమై, స్టైల్ సినిమాలో మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, తడవ తడవకు, రా రా రమ్మంటుంన్నా పాటలు రాయించాడు. ఆ తరువాత 2006లో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన డాన్ సినిమాలో అన్ని పాటలు రాయడంతోపాటు సంగీత దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించాడు. డాన్ సినిమా తరువాత సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తానని లారెన్స్ మాట ఇచ్చాడు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. చరణ్ దాదాపు వంద సినిమాలకు పాటలు రాశాడు, అనధికారికంగా ఎన్నో పాటలకు సంగీతాన్ని సమకూర్చాడు.
యూట్యూబ్ ఛానల్
సినిమా పాటలు మాత్రమేకాకుండా ప్రైవేటు పాటలు రూపొందించాలన్న ఉద్ధేశ్యంతో 2019లో జీఎంసీ టెలివిజన్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. తాను పెరిగిన ఊరు, అక్కడి పరిస్థితులపై ఎట్టుండెరా ఊరు ఎట్టుండెరా అనే పాటను రూపొందించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడంతో ఆ పాటకు మంచి స్పందన వచ్చింది. ఆ తరువాత ఇతర పాటలను రూపొందించి తన ఛానల్ ద్వారా వీక్షకులకు అందిస్తున్నాడు. వాటిల్లో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ రాసిన పండగొత్తాందంటే సాలు పాట, కేసీఆర్ కథాగానం పాట, ఎవలు రమ్మన్నారు కొడుకా... నిన్ను ఎవలు పొమ్మన్నారు కొడుకా మొదలైన పాటలు ప్రజాదరణ పొందాయి.
రాసిన/పాడిన పాటలు
చరణ్ అర్జున్ రాసిన/పాడిన పాటలు
- 2003 - ఆయుధం: ఇదేమిటమ్మా మాయా మాయా (మొదటి పాట)
- 2003 - తొలిచూపులోనే: పగడాల పెదవిపై
- 2004 - సఖియా:
- 2005 - అతనొక్కడే: నాటీ గర్ల్
- 2005 - వీరభద్ర: బొప్పాయి బొప్పాయి
- 2006 - స్టైల్: మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, తడవ తడవకు, రా రా రమ్మంటుంన్నా
- 2006 - రారాజు: ముద్దు ముద్దుగా
- 2006 - రామ్: షాక్
- 2007 - డాన్: అన్ని పాటలు
- 2007 - లక్ష్మీ కళ్యాణం: అవ్వా అవ్వా
- 2009 - కొంచెం ఇష్టం కొంచెం కష్టం: ఎవడే సుబ్రహ్మణ్యం
- 2009 - బంగారు బాబు: నింగిలోని, 16వ ఏట
- 2010 - శంభో శివ శంభో: ఎవరేమైన ప్రేమ, ఆడిండిరా బాబు, కనుపాపలో ప్రేమ, శంభో శివ శంభో, జగడం
- 2010 - కేడి: కేడిగాడు, నువ్వే నా నువ్వే నా, ఎందుఓ ఎంతకి, రేలారే, నీలో ఏమున్నదో, ముద్దంటే
- 2010 - స్నేహగీతం: గల గల, సరిగమ పదని, వసంతమేది
- 2010 - చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి: చెలి చెలి
- 2011 - సాధ్యం: అన్ని పాటలు
- 2011 - నేను నాన్న అబద్ధం: మన్నులో
- 2012 - రచ్చ: ఢిల్లకు ఢిల్లకు
- 2013 - వసూల్ రాజా: ముద్దొస్తున్నావ్ నానా
- 2013 - యాక్షన్ 3D: డింగ్ డాంగ్ (గానం)
- 2014 - నేను నా ఫ్రెండ్స్: గోలీలాట, బ్రేకప్, బిర్యానీ, ఇదంతా ఏమిటో, సాప్ట్‌వేర్
- 2014 - మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: అన్ని పాటలు
- 2014 - అదిలెక్క: అన్ని పాటలు
- 2017 - నివాసి (2019)
- 2019 - జార్జ్ రెడ్డి: నాలాగే అన్నీ నాలాగే (రచన, గానం)
సంగీతం అందించిన చిత్రాలు
చరణ్ అర్జున్ సంగీతం అందించిన చిత్రాలు
- 2009: బ్యాంక్
- 2011: సాధ్యం
- 2011: నేను నాన్న అబద్ధం
- 2012: మా అబ్బాయి ఇంజనీరింగ్ స్టూడెంట్
- 2013: కెవ్వు కేక
- 2013: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
- 2014: నేను నా ఫ్రెండ్స్
- 2014: అదిలెక్క
- 2014: కరెన్సీ రాజా
- 2015: లొడ్డె
- 2015: నేను నా ప్రేమకథ
- 2015: ఫుల్ గ్యారెంటి
- జయహే
- పయనం
- 2019: అశ్వమేధం
- అసలు ఏం జరిగిందంటే (2021)
- భీమదేవరపల్లి బ్రాంచి (2023)
- విమానం (2023)
నిర్మించిన చిత్రాలు
- 2014: అదిలెక్క
మూలాలు
ఇతర లంకెలు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో చరణ్ అర్జున్ పేజీ
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో చరణ్ అర్జున్ పేజీ(చిన్ని చరణ్)