Vasavadatta Ramana Kamarajugadda

The basics

Quick Facts

Birth1967
Age58 years
The details

Biography

కామరాజుగడ్డ వాసవదత్త రమణ వర్తమాన తెలుగు రచయిత్రులలో ఒకరు. ఈమె ఎం.వి.రామారావు, హైమావతి దంపతులకు 1967, జనవరి 12 వ తేదీన హైదరాబాదులో జన్మించింది. ఈమె విద్యాభ్యాసం అంతా హైదరాబాదు, సికిందరాబాదులలో గడచింది. ఈమె తల్లి రేడియో కళాకారిణి, తండ్రి ప్రముఖ రంగస్థల నాటక దర్శకుడు, నటుడు, ప్రయోక్త, సాహిత్యవేత్త కావడంతో ఈమెకు చిన్న తనం నుండే తెలుగు భాష పట్ల మక్కువ ఏర్పడింది. ఈమె తాతగారు స్వాతంత్ర్య సమరయోధుడు. ఈమె స్నాతకోత్తర పట్టాను పొంది ప్రస్తుతం హైదరాబాదులో ఎ.పి.బివరేజస్ కార్పొరేషన్‌లో డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నది. ఈమె భర్త హెచ్.ఐ.ఎల్.లో ఉన్నతోద్యోగి. ఈమెకు ఇద్దరు కుమారులు. వారు అమెరికాలో స్థిరపడ్డారు. ఈమె ఆకాశవాణి, దూరదర్శన్‌లలో గ్రేడెడ్ కళాకారిణిగా పాతికేళ్ళకు పైగా కృషి చేసి అనేక పిల్లల కథలు, నాటికలు, సాంఘిక నాటకాలు, కథానికలు వ్రాసి ప్రసారం చేసింది. ఈమె దూరదర్శన్‌లో స్త్రీలకార్యక్రమాలు, ఆరోగ్య కార్యక్రమాలు, న్యాయసలహాలు, ఈ వారం అథితి వంటి అనేక కార్యక్రమాలకు వ్యాఖ్యాత్రిగా పనిచేసింది. ఈమె శ్రీదత్త సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసి దానికి కార్యదర్శిగా పనిచేస్తున్నది. ఈ సంస్థ ద్వారా తన తండ్రి ఎం.వి.రామారావు పేర ప్రతి సంవత్సరం ఒక రంగస్థల కళాకారునికి పురస్కారాన్ని అందజేస్తున్నది. ఈ పురస్కారం అందుకున్నవారిలో కాకరాల, శ్రీపాద కుమారశర్మ తదితరులకు లభించింది.

రచనలు

ఈమె తొలి కథ అరుగు 2006లో ప్రచురితమైనది. అప్పటి నుండి ఈమె 70కి పైగా కథలు, కొన్ని నవలలు వ్రాసింది. ఈమె కథల సంపుటి వెలుగురేఖలు Tribute పేరుతో ఆంగ్లంలోనికి అనువదించబడింది.

ఈమె ప్రకటించిన కొన్ని పుస్తకాలు:

  1. వెలుగురేఖలు (కథా సంపుటి)
  2. ఒంటరి నక్షత్రం (కథా సంపుటి)
  3. సంధ్యారాగం (నవల)
  4. లక్ష్యం (నవల)
  5. అంతరాలు (కథా సంపుటి)
  6. స్వాగతం (కథా సంపుటి)

బహుమతులు

ఈమె వ్రాసిన కథలు అనేక బహుమతులను గెలుచుకున్నాయి. వాటిలో కొన్ని:

  • 2008లో స్వాతి సపరివారపత్రిక నిర్వహించిన కథలపోటీలో కంటిరెప్ప కథకు బహుమతి.
  • 2010లో ఆంధ్రప్రభ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంయుక్తంగా నిర్వహించిన మొదటి అంతర్జాతీయ మహిళా కథల పోటీల్లో బహుమతి.
  • 2014లో నవ్య వారపత్రిక - నాట సంయుక్తంగా నిర్వహించిన కథలపోటీలో పరివర్తన కథకు బహుమతి.
  • 2015లో ఈనాడు ఆదివారం కథల పోటీలో ఏడు అడుగులు కథకు బహుమతి.

మూలాలు

బయటి లింకులు

The contents of this page are sourced from Wikipedia article on 05 May 2024. The contents are available under the CC BY-SA 4.0 license.