Thadi Nagamma

Telangana Writer
The basics

Quick Facts

IntroTelangana Writer
isWriter
Work fieldLiterature
Birth1908
The details

Biography

తాడి నాగమ్మ తొలి దళిత తెలుగు కథారచయిత్రి. ఆధునిక భావాలతో .. కథలు, వ్యాసాలు రాసింది. దళిత, స్త్రీవాద సాహిత్యానికి తొలి మెట్టు వేసిందామె. తాడి నాగమ్మ పుట్టిననాటికే అక్కడ కొంత దళిత చైతన్యం పురుడు పోసుకున్నది. అయితే అది చాలా పరిమితంగానే ఉండేది.

జీవిత విశేషాలు

ఆమె 1908 జులై 6 న తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం, మోరివారిపాలెం లో బల్లా పుల్లయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించింది. దళితురాలైన నాగమ్మ ఆప్పట్లో స్కూలుకు వెళ్లడమనేది సాధారణ విషయం కాదు. బడిలో పంతుళ్ల నుంచి అవమానాలు ఎదుర్కొన్నది. పట్టు విడవకుండా చదువు సాగించింది. ఆమె విద్యాభ్యాసం 1925-30 ప్రాంతంలో సాగింది. 1925లో మామిడి కుదురు మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన తాడి వెంకన్నను వివాహం చేసుకున్నారామె. నాగమ్మకు ఇద్దరు సంతానం. ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఆమె భర్త 1935లో రంగూన్‌లో మరణించగా మచిలీపట్నంలో వేమూరి రాంజీరావు గారి దళితుల హాస్టలులో తన పిల్లల్ని చేర్పించింది. ఆ కాలంలో  ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు కూడా అందుకున్నది. పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ పలువిధాలుగా సమాజ సేవ చేసింది. ఊటుకూరి లక్ష్మికాంతమ్మ గారు తన ‘ఆంధ్ర కవయిత్రులు’ పుస్తకంలో ఆమెను కథా రచయిత్రిగా పేర్కొన్నది.

ఆమె 1930లో గాంధీజీ సభల్లో పాల్గొన్నది. ఆమె కుసుమధర్మన్న లాంటి దళిత కవులు, ఆది ఆంధ్ర మహాసభలు, హరిజన్‌సేవక్‌ సంఘ్‌ లాంటి సంస్థల పరిచయంతో కథలు రాయడం మొదలు పెట్టింది. మోరిపాలెంలో లేబర్‌ స్కూల్‌ లో టీచర్‌గా పనిచేసింది. ప్రతి గుడిపక్కన లైబ్రరీలు పెట్టింది. ప్రాథమిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసింది. భజన, బుర్రకథ, నాటకం లాంటి జనరంజక మాధ్యమాలను చేపట్టింది.

కథలు

ఆమె రాసిన తొలి కథ ‘ఇంకెక్కడి జయము’ 1934లో ‘గృహలక్ష్మి’ పత్రికలో ప్రచురితమయ్యింది. ఒక దళిత వనిత రాసిన తొలి తెలుగు కథ అది. దాంతో పాటు భారతి పత్రికలో కూడా ఆమె కథలు అచ్చయ్యాయి. ఇది మాములు విషయం కాదు. ఇలా ఆమె సామాజిక సమస్యలు, స్త్రీల సమస్యలు, మనుష్యుల మధ్య సంబంధాలు, ఈర్ష, ఆసూయ, ద్వేషాల గురించి మంచి అవగాహనతో రచనలు చేసింది. ప్రేమ సమస్య, ఒక ముద్దు, సమాధులపై సౌధం నిర్మించ వద్దు, స్త్రీకన్నీరు, ప్రపంచ ఘోష మానవ విప్లవం, ప్రేమ సమస్య లాంటి రచనలు చేసింది.

మొదటితరం చదువుకున్న దళిత స్త్రీలలో తాడి నాగమ్మ 'ముద్దు' కథలో- ఒక స్త్రీ వలసవాదానికి వ్యతిరేకంగా విదేశీ వస్తు బహిష్కరణ చేయాలని ఒక నాగరికుణ్ణి కోరగా, అతడు ప్రతిఫలంగా ముద్దివ్వాలని అడుగుతాడు. 'విదేశీ హాలాహలముకు ఆహుతి అగుతున్న నీబోటి సోదరుణ్ణి రక్షింపనొక ముద్దీయలేనా?' అనడంతో అతనికి మూర్ఛ వస్తుంది.

అస్తమయం

ఆమె 1990 సెప్టెంబర్‌ 13న కన్నుమూసింది.

గుర్తింపు

తొలి దళిత కథా రచయిత్రిగా తాడి నాగమ్మను గుర్తించి, ఎంతగానో శ్రమించి ఆమె రచనలను, ఆమె జీవిత విశేషాలను సేకరించి పుస్తక రూపంలోకి సంగిశెట్టి శ్రీనివాస్ తీసుకువచ్చాడు. ఆ పుస్తకం "తాడినాగమ్మ కథలు-రచనలు"

మూలాలు

బయటి లింకులు

The contents of this page are sourced from Wikipedia article on 26 Dec 2019. The contents are available under the CC BY-SA 4.0 license.