Biography
Also Viewed
Quick Facts
Gender |
| |
Birth | 1952 | |
Age | 73 years |
Biography
డాక్టర్ సాకం నాగరాజ (ఆంగ్లం: Sakam Nagaraja) ప్రముఖ తెలుగు కవి, తెలుగు భాషోద్యమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు తెలుగు భాషోద్యమానికి పాటు పడుతున్న వ్యక్తి. వీరు చిత్తూరు జిల్లాలోని సాహిత్య ప్రియులను, తెలుగు పండితులను మరియు ఇతర రచయితలను కలుపుకొని సాహిత్యసేవ / తెలుగు భాషా సేవ చేస్తున్న ఒక సాహితి ప్రియుడు.
బాల్యం, విద్యాభ్యాసం
సాకం నాగరాజ చిత్తూరు జిల్లా పాకాల మండలం, వరదప్పనాయుడు పేట గ్రామంలో శ్రీ సాకం శేషయ్య మరియు శ్రీమతి సుందరమ్మ దంపతులకు 1952 జూలై 1 న జన్మించారు. పాఠశాలవిద్యను దామలచెరువులోను, ఉన్నతవిద్యను తిరుపతిలోను అభ్యసించారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి తెలుగు భాషలో పరిశోధనకు పి.హెచ్.డి పట్టాను పొందారు. చిన్నతనం నుండే తెలుగు భాషపై అభిమానం పెంచుకున్న సాకం నాగరాజ చదువు చున్నప్పుడే అనేక బాషోద్యమాలలో పాలుపంచుకున్నారు. విద్యార్థి సంఘాలలో శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అధ్యక్షులు గాను, కళాశాల ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శిగాను పనిచేశారు. విప్లవ రచయితల సంఘం (విరసం) లో పదేళ్ళపాటు పనిచేశారు.
అలంకరించిన పదవులు/సాధించిన విజయాలు
కాళహస్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. విశాలాంధ్ర ప్రచురణల ఎడిటోరియల్ బోర్డు మెంబరుగా ఉన్నారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రచురణ కర్తగాను, అనేక పుస్తకాలకు సంపాధకుడిగాను ఉన్నారు. తెలుగు భాషోద్యమ సమితి, తిరుపతి స్థాపకుడు. వీరు పాఠశాల పిల్లలకు ఉపయోగపడే అనేక పుస్తకాలను ప్రచురించి వారికి ఉచితంగా పంపిణి చేసారు. తిరుపతిలో తాను నివాసముంటున్న వరదరాజనగర్ లో ఒక గ్రంధాలయాన్ని స్థాపించి అనేక పుస్తకాలను సేకరించి, అందులో వుంచి చదువరులకు సేవ చేస్తున్నాడు.
నిర్వహించిన ముఖ్యమైన కార్యక్రమాలు
తెలుగు కవుల, రచయితల జయంతి, శతజయంతి ఉత్సవాలను ప్రతి ఏడు నిర్వహించడము, ఆయా కవుల, రచయితల వారి రచనలను ప్రశంసిస్తూ పుస్తకావిష్కరణ నిర్వహించడము.తిరుపతిలో తెలుగు భాషకు సంబంధించిన ఏ కార్యక్రమైనా అందులో పాల్గొనడానికి ముందుకు వచ్చి దాని జయప్రదం చేయడానికి నిస్వార్థంగా కృషి చేస్తారు. అంతేకాక తిరుపతిలో ఐన్ స్టీన్ విగ్రహం గాని, శంకరంబాడి సుందరాచార్య విగ్రహం, శ్రీ శ్రీ విగ్రహం పెట్టినా, వీదులకు, పార్కులకు గురుజాడ, కందుకూరి వంటి సాహితీ కారుల పేర్లు పెట్టినా ఆ కృషి వెనుక సాకం నాగరాజ తప్పక వుంటాడు.
తెలుగు రాష్ట్రాలలోని సాహిత్య కారులకు సుపరిచితమైన పేరు సాకం నాగరాజ. విప్లవకవి వరవరరావు మొదలు ప్రముఖ కవి యాకూబ్ వరకు, తిరుపతి అనగానే నాగరాజ పేరునే ప్రస్తావిస్తారు. తిరుపతిలో తెలుగు సాహిత్య కార్యక్రమం ఎవరు నిర్వహించినా ముందుండి తన సహకారాలను అందించే తత్వం నాగరాజది. తెలుగు భాష కలకాలం నిలబడాలన్నా..... విధ్హ్యార్తులలో భాషా పరిజ్ఞానము పెరగాలన్నా విజ్ఞానాభివృద్దికి.... విద్యార్థులు పుస్తక పఠనం చేయాలని ఆశించే ఇతను, ఆ దిశగా తన వంతు ప్రయత్నంగా తెలుగు భాషోద్యమ సమితి, తిరుపతి అనే సంస్థను స్థాపించి..... తద్వారా పుస్తకాలను ప్రచురించి చిత్తూరు జిల్లాలో అనేక పాఠశాలకు, కళాశాలలకు స్వయంగా వెళ్ళి విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంచి వారిచే పుస్తకాలను చదివించేవారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ పుస్తక దినోత్సవం నాడు సంకల్పించి ఒక వారంపాటు దాన్ని ఒక పండుగగా చేసేవారు. ఈ కార్యక్రమంలో అమ్మచెప్పిన కథలు,, స్వయంగా వ్రాసిన బాల నిఘంటువు, పిల్లల పుస్తకాన్ని (బాపు బొమ్మలతో) వేలాదిగా విద్యార్థులకు పంచారు. పుస్తక పఠనం మనిషి జీవితాన్ని మార్పు చేస్తుందని నమ్మిన వ్యక్తి సాకం నాగరాజ. ఈ పుస్థక పఠన ఉద్యమాన్ని చిత్తూరు జిల్లాలోనే కాక విశాఖపట్నం జిల్లాలోకూడ నిర్వహించి విద్యార్థులలో పుస్తక పఠనాశక్తిని పెంపొందించారు.
తెలుగు వికీపీడియా తిరుపతిలో నిర్వహించిన 11వ వార్షికోత్సవాలలో తనవంతు సహకారాన్ని అందించి 88 కథలున్న "పిల్లల పుస్తకం" యొక్క కాపీహక్కుల్ని వికీసోర్స్ కు అందించారు.
గతంలో పాఠకుల కోసం, స్కూలు విద్యార్థుల కోసం అనేక పుస్తకాలు వెలువరించిన సాకం నాగరాజ కాలేజీ విద్యార్థుల కోసం ప్రపంచ కథా సాహిత్యాన్ని ఒక చోట చేర్చి పుస్తకంగా వెలువరించారు. అమ్మడానికి కాదు. పంచి పెట్టడానికి. పది మంది చదివి ఇద్దరు అందుకున్నా చూసి సంతోష పడటానికి. జీవితంలో పైకొచ్చినవారంతా ఏదో ఒక దశలో పుస్తకాలను ఆలంబనగా చేసుకున్నవారే. మన పిల్లలకు ఇప్పటి నుంచే ఎందుకు వాటిని అలవాటు చేయకూడదు అనేది సాకం ఆలోచన.
ప్రచురించిన పుస్తకాలు
సాకం నాగరాజ సంకలనం చేసిన పుస్తకాలు.
- తెలుగు కథకు నూరేళ్ళు నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని ఇతరులు వ్రాసిన గొప్ప కథలను తెలుగు కథకు జేజే,
- కథా సంకలనం. (2009)
- రైతు కథలు
- పిల్లల పుస్తకము స్వంతంగా వ్రాసిన
- బాల నిఘంటువు వంటి వాటిని ప్రచురించారు.
- శాంతా సిన్హా, అమర్త్య సేన్ వంటి యాబై మంది ప్రముఖుల వ్యాసాలతో జన విజ్ఞాన వేదిక ప్రచురించిన పుస్తకానికి సంపాదకత్వం వహించారు.
- దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయ చరిత్ర అనే ఒక మంచి గ్రంథాన్ని అభినవ ప్రచురణల ద్వారా, స్వీయ సంపాదకత్వంలో సాకం నాగరాజ ద్వితీయ ముద్రణ వెలువరించారు.
- ప్రపంచ కథా సాహిత్యం (2015) నోబెల్ బహుమతి పొందిన రచయితల కథల తెలుగు అనువాదాల సంకలనం.
మూలాలు
- 1. సాక్షి చిత్తూరు: 13.9.2008. ప్రపంచ పుస్తక పఠన దినోత్సవ సందర్భంగా వచ్చిన వార్త
- 2. ఆదివారం వార్త: 28.12.2008.
- 3. ఈనాడు చిత్తూరు. 30.6.2010 పదవీ విరమణ సందర్భంగా ప్రచురించిన వార్త
- 4. ఆంధ్ర జ్యోతి. చిత్తూరు 30.6.2010 పదవీ విరమణ సందర్భంగా ప్రచురించిన వార్త
- 5. ఆంధ్ర జ్యోతి నవ్య వీక్లి. 22.9.2010
- 6. ఆదివారం. వార్త. చిత్తూరు. 12.9.2010
- 7. ప్రజాసాహితి, నవంబరు 2010
- 8. The Hindu. Tuesday, September, 9, 2008
- 9. The Hindu, Sunday, September, 13, 2009