John everett clough

The basics

Quick Facts

Gender
Male
Birth1836
The details

Biography

జాన్ ఎవరెట్ క్లౌ (జూలై 16 1836-నవంబర్ 26 1910) తెలుగునాట పేరొందిన క్రైస్తవ మతబోధకుడు, సేవకుడు. అమెరికాకు చెందిన జాన్ క్లౌ భారతదేశానికి క్రైస్తవ మతబోధనకు వచ్చి ఒంగోలులో బాప్తిస్ట్ మిషన్ని నడిపించారు. 1876-78 మధ్యకాలంలో వచ్చిన తీవ్రమైన కరువులో ఆనాటి సమాజంలో అట్టడుగున జీవిస్తున్న కులస్తులకు పనికల్పించి, ఆహారం అందించి కాపాడారు.

కుటుంబ నేపథ్యం

జాన్ క్లౌ అమెరికాలోని న్యూయార్కు దగ్గరలోని ఫ్రెస్‌బర్గ్‌లో 1836లో వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించారు. వారి కుటుంబం ఐయోవా ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల పనులు చేశారు. వ్యవసాయం, సర్వేపనులు చేసుకుంటూనే చదువుకుని అప్పర్ ఐయోవా యూనివర్శిటీ ఆఫ్ ఫయెట్టే నుంచి 1862లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నారు. ఆయన మొదటి భార్య హారియట్. 1893లో ఆమె మరణించాక 1894లో మరో మతప్రచారకురాలైన ఎమ్మా రొషాంబుని వివాహం చేసుకున్నారు. ఎమ్మా రొషాంబు మతప్రచారకురాలు, విదుషి. ఆమె బెర్న్ విశ్వవిద్యాలయంలో పీహెచ్.డి. పూర్తిచేశారు. ఆమె పరిశోధక కృషికి గుర్తింపుగా రాయల్ ఏషియాటిక్ సొసైటీలో సభ్యత్వం పొందారు.

మతప్రచారకునిగా

భారతదేశ ఆగమనం

అమెరికా, కెనడాకు చెందిన మతబోధకులతో ప్రారంభించిన లోన్ స్టార్ మిషనరీ ద్వారా భారతదేశానికి వచ్చారు. 1840ల్లో ప్రారంభమైన ఈ మిషన్‌ని మూసివేసేందుకు 20 ఏళ్ళ కాలంలో మూడుసార్లు ప్రతిపాదనలు జరిగాయి. అయితే చివరిసారి 1862లో ప్రతిపాదింపబడింది. ఈ మిషన్లో పనిచేసేందుకు క్లౌ దంపతులు 1864 నవంబరులో బోస్టన్ ఓడరేవులో బయలుదేరి 1865 ఏప్రిల్ 22 న నెల్లూరు చేరుకున్నారు. ఆయనను ఒంగోలు కేంద్రంగా మతప్రచారం చేసేందుకు నియమించారు. క్రైస్తవమతస్తునిగా మారిన తన బంధువు ద్వారా క్రైస్తవాన్ని గురించి తెలుసుకున్న పేరయ్య మతం మార్చారు. పేరయ్య ప్రచారం ద్వారా వందలమంది క్రీస్తును నమ్మడం ప్రారంభించడంతో తర్వాతి ఏడాది జనవరిలో వారిని సందర్శించి బాప్తిజం ఇచ్చారు.

కరువులో సేవ

1876-78 కాలంలో కోస్తాంధ్ర ప్రాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన కరువు కాలంలో క్లౌ చేసిన సేవలు పేర్కొనదగినవి. 1876లోనే కరవు జాడలు పసిగట్టి ఆంగ్లేయ ప్రభుత్వం ప్రారంభించిన బకింగ్ హాం కాలువ పనులలో 3 మైళ్ళ పనికి కాంట్రాక్టు ప్రయత్నించి పొందారు. రాజుపాలెం అనే గ్రామం వద్ద సహాయ శిబిరాన్ని ఏర్పాటుచేసి "అన్నం పెట్టించి, కూలీ ఇస్తానని" బోధకులతో గ్రామాల్లో చెప్పించారు. వారిని అనుసరించి అనూహ్యమైన సంఖ్యలో అన్నార్తులు వచ్చారు. వేలాదిమంది బీదసాదలు ఆ శిబిరానికి నకనకలాడుతూ చేరుకుని అప్పటికి ఉడకని అన్నమే తిని మరణించినవారూ, చేరుకుంటూనే తట్టుకోలేక మరణించినవారూ, రేపు తినగలమో లేదోనని తినీ తినీ చనిపోయినవారూ ఇలా వేలకొద్దీ శవాలు పేరుకునేవి. వాటిని తీయించి శుభ్రం చేయించి ఉన్నవారిని బతికించుకునేందుకు ప్రయత్నాలు చేసేవారు. వేలాదిమంది కూలీలను, అట్టడుగు వర్గాలకు చెందినవారినీ వారు పనుల నెపంతో బతికించారు.

పెద్ద ఎత్తున మతమార్పిడులు

సహాయశిబిరాలకు వచ్చిన కొత్తల్లో ప్రజలు బోధకులతో ఎన్నోమార్లు వినివున్నా మళ్ళీ మళ్ళీ "ప్రయాస పడి భారము మోసికొని పోవుచున్న జనులారా నాయొద్దకు రండు. నేను మీకు శాంతినిత్తును." అన్న బైబిల్ వాక్యాలు చెప్పించుకుని విని ఉపశాంతి పొందేవారట. ఇలాంటి స్థితిలోని వారి ఆకలి తీర్చి ఆదుకోవడంతో వారు క్రైస్తవమతంలోకి మారుతామనేవారట, అయితే రెవరెండ్ క్లౌ మాత్రం కరవు ఛాయలు పూర్తిగా ముగిసిపోయేవరకూ మతమార్పిడులు జరగరాదని నియమం విధించారు. తనను ఈ పనికై పంపిన పై చర్చి అధికారుల కోపాన్ని చవిచూసి కూడా ఆయన ఆ నియమానికి కట్టుబడే ఉన్నారు.

కరువు ముగిసి, సహాయచర్యలు పూర్తైన ఆరునెలల వరకూ ఆగి ఆ తర్వాతే బాప్తిజం ఇవ్వడం ప్రారంభించారు. తన నుంచి ఏ సహాయం అందదని స్పష్టం చేసి, ఆయా పాస్టర్ల వెనుక వచ్చిన ప్రజలు కొత్త మతాన్ని స్వీకరించేందుకు సంసిద్ధులై ఉన్నారా లేదా అన్నది పరిశీలించిన తర్వాత మతమార్పిడి చేశారు.

1878 జూలై 2 న గుండ్లకమ్మ నదీతీరంలో 616 మంది బాప్తిజం పొంది క్రైస్తవాన్ని స్వీకరించారు. జూలై 3వ తేదీన 2,222 మంది క్రైస్తవాన్ని స్వీకరించారు. తర్వాతి రోజున 700మంది స్వీకరించారు. ఇలా కొనసాగుతూ 3వేల వరకూ ఉన్న ఒంగోలు చర్చి సభ్యుల సంఖ్య 1979 సంవత్సరం నాటికి 9వేల పైచిలుకు కొత్త సభ్యులతో మొత్తంగా 13వేలు అయింది. కొత్తగా మతస్వీకరణ చేసినవారిలో అత్యధికులు చర్మకార వృత్తికి చెందిన మాదిగ కులస్తులే.

ఉద్యోగ విరమణ

1906లో ఉద్యోగ విరమణ చేసిన రెవరెండ్ జాన్ ఎవరెట్ క్లౌ, ఉద్యోగ విరమణానంతరం కూడా భారతదేశంలోనే నివసించారు. చివరకు 1910లో అమెరికా తిరిగివెళ్ళాకా, అదే సంవత్సరం నవంబరు 24 న అమెరికాలో మరణించారు.

గౌరవాలు, సత్కారాలు

రెవ.జాన్ ఎవరెట్ క్లౌ తెలుగు క్రైస్తవ సమాజానికి చేసిన సేవలకు గాను తెలుగు అపోస్తలుడు (అపోస్తల్ ఆఫ్ తెలుగూస్) అన్న బిరుదుతో ప్రఖ్యాతిపొందారు. 1882లో మిచిగాన్ కళాశాల నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.

మూలాలు

ఇతర లింకులు

The contents of this page are sourced from Wikipedia article on 13 Sep 2020. The contents are available under the CC BY-SA 4.0 license.