Biography
Lists
Also Viewed
Quick Facts
Biography
అయినంపూడి శ్రీలక్ష్మి తెలుగు కవయిత్రి, రచయిత్రి. ఆకాశవాణి, హైదరాబాదులో రెండున్నర దశాబ్దాలుగా అనౌన్సరుగా పనిచేస్తున్నారు. శ్రీలక్ష్మి అనేక వ్యాసాలు, పుస్తకాలు, కవితలు ప్రచురించారు. కొన్ని డాక్యుమెంటరీలు కూడా తయారుచేసారు. సినిమాలపై అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆలిండియా రేడియోలో పేరొందిన వ్యక్తులతో ఇంటర్వ్యూ కార్యక్రమాలను నిర్వహించారు. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ సాహిత్యకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు.
జీవిత విశేషాలు
ఆమె నిజామాబాదు జిల్లా లోని బోధన్ లో 1967 ఆగస్టు 15 న జన్మించారు. ఆమె పూర్వికులు 1940ల్లో ఆంధ్రా నుంచి ఇక్కడికి వలస వచ్చారు. విజ్ఞానశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ ను గిరిరాజ్ కళాశాలలో పూర్తిచేసారు. రాజనీతి శాస్త్రంలో మాస్టర్ డిగ్రీని డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో చేసారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఎడ్ చేసారు. ఆమె హైదరాబాదు ఆకాశవాణిలో అనౌన్సరుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఆమెకు కవిత్వం, చిత్రనిర్మాణాలపై ఆసక్తి ఎక్కువ. ఆమె అనేక ఆర్టికల్స్, పుస్తకాలు, కవితలను వివిధ విషయాలలో (ఫైన్ ఆర్ట్స్, సినిమాలు) ప్రచురించారు.
సాహితీ సేవలు
ఆమె పాఠశాల విద్యాభ్యాసం నుండే సాహితీ ప్రస్థానం ప్రారంభించారు. పాఠశాలలో కవితలు వ్రాసేవారు. పాఠశాల మ్యాగజైన్ కు ఎడిటరుగా ఉండేవారు. ఆమె 2000లో ఇందూర్ స్పెషల్ ఇష్యూలోని ఎడిటోరియల్ మెంబరుగా ఉన్నారు. ఆమె యోజన మాసపత్రిక, ప్రజాశక్తిలో వివిధ రచయితలు, కవులు వ్రాసిన కవితలు, కథలు, నవలలకు సమీక్షలు వ్రాసారు. 2001లో "అలలవాన", 2003 లో దృక్కోణం (భావ చిత్రాలు) పుస్తకాలను ప్రచురించారు. 2011 లో లైఫ్@చార్మినార్ అనే దీర్ఘ కవితను ప్రచురించారు. ఆమె ఒక డాక్యుపోయం అనే కొత్త సాహిత్య ప్రక్రియతో దీర్ఘ కవితను ప్రవేశపెట్టారు. ఈ కవిత 5వ కాఫిసో జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్పెషల్ జ్యురీ అవార్డును కైవసం చేసుకున్నారు. ఆమె వ్రాసిన "వెన్నెల దుఃఖం"కవితకు 2012, జనవరి 18న రంజని కుందుర్తి అవార్డు వచ్చింది.
రచనలు
కవిత్వ సంపుటిలు
- అలలవాన
- దృక్కోణం
- దర్వాజా మీద చందమామ
- కవిత్వమే ఓ గెలాక్సీ
దీర్ఘ కవిత
- లైఫ్ @చార్‌మినార్
- వూండెడ్ హార్ట్ (మోనోలాగ్ ఆఫ్ ఏ వూండెడ్ హార్ట్ పేరుతో ఇంగ్లీష్ లోకి, గాయగూండ హృదయ స్వగత కన్నడంలోకి అనువాదం అయింది)
లేఖా సాహిత్యం
- కొత్త ప్రేమలేఖలు
- ఇట్లు మీ కరోనా
అనువాదాలు
- ఖలీల్ జిబ్రాన్ (కథలు)
అక్షరయాన్ స్థాపన
శ్రీలక్ష్మి, 500మంది తెలుగు మహిళా రచయిత్రుల విభాగంగా తన నిర్వహణలో 2019 జూన్ నెలలో అక్షరయాన్ అనే తెలుగు మహిళా రచయిత్రుల ఫోరంను ఏర్పాటుచేశారు. పద్దెనిమిది సాహితీ ప్రక్రియల్లో సమకాలీన అంశాలపై రచనలు సాగించడం, రచయిత్రులను సంఘటితం చేయడం లక్ష్యంగా ఏర్పడిన అక్షరయాన్ ఫోరంకు శ్రీలక్ష్మి వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నారు.
ఇతర వివరాలు
- కరోనా 19పై శ్రీలక్ష్మి రాసిన కరోనాకి ఓ రిటర్న్ గిఫ్ట్ అనే కవిత 2020, మార్చి 23న నమస్తే తెలంగాణ పత్రికలోని చెలిమె విభాగంలో ప్రచురితమయింది. ఆ కవితను చూసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫోన్ లో స్వయంగా శ్రీలక్ష్మిని అభినందించడమేకాకుండా ఆరోజు జరిగిన పత్రికా సమావేశంలో ప్రశంసలు అందజేశాడు.
అవార్డులు
- ''లైఫ్ ఎట్ చార్మినార్'' డాక్యుమెంటరీకి స్పెషల్ జ్యూరీ అవార్డు (పాలపిట్ట 5వ జాతీయ షార్ట్-డాక్యుమెంటరీ ఫిల్మోత్సవం, కరీంనగర్, 2011 ఏప్రిల్ 10)
- "కీర్తి పురస్కారం" - ఉత్తమ రచయిత్రి విభాగం - తెలుగు విశ్వవిద్యాలయం, 2013.
- "ప్రతిభా పురస్కారం" - ఉత్తమ రచయిత్రి విభాగం - తెలుగు విశ్వవిద్యాలయం, 2014.
- ''అమృతలత - అపురూప అవార్డ్స్ 2019'' - రేడియో రంగం, తెలుగు విశ్వవిద్యాలయం, 2019 మే 12.
- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2020 మార్చి 8.
- ''ఆచార్య పాకాల యశోదారెడ్డి సాహితీ పురస్కారం'' - తెలంగాణ సారస్వత పరిషత్తు, 2021 ఆగస్టు 11.
హోదాలు
- జ్యూరీ మెంబర్: 2009 టి.వి. నంది పురస్కారాలు
చిత్రమాలిక
- అలల వాన పుస్తక కవర్ పేజీ
- వూడెండ్ హార్ట్ పుస్తక కవర్ పేజీ
- లైఫ్ @చార్మినార్ పుస్తక కవర్ పేజీ
- ఖలీల్ జిబ్రాన్ అనువాద పుస్తక కవర్ పేజీ