D Pasupathi

Carnatic Musician - Vocalist
The basics

Quick Facts

IntroCarnatic Musician - Vocalist
isSinger Music educator
Work fieldAcademia Music
Gender
Male
The details

Biography

దొరైస్వామి పశుపతి ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడు.

విశేషాలు

ఇతడు 1931లో తమిళనాడు లోని తిరువణ్ణామలైలో జన్మించాడు. ఇతడు 14 ఏళ్ళ పిన్నవయసులో మద్రాసు కళాక్షేత్రకు వచ్చి అక్కడ మహామహులైన టైగర్ వరదాచారి, బడలూర్ కృష్ణమూర్తిశాస్త్రి, టి.కె.రామస్వామి అయ్యంగార్, ముదికొండన్ వెంకట్రామ అయ్యర్, మైసూరు వాసుదేవాచార్య వంటి విద్వాంసుల వద్ద సంగీతం నేర్చుకున్నాడు. కళాక్షేత్రలో సంగీతంలో స్నాతకోత్తర డిప్లొమా పొందిన తర్వాత 1957లో అదే సంస్థలో సంగీతాధ్యాపకుడిగా చేరాడు. తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాలలో ప్రిన్సిపాల్‌గా చేరాడు. అక్కడ పదవీ విరమణ పొందిన తరువాత 1995లో రుక్మిణీదేవి అరండేల్ అభ్యర్థనపై తిరిగి కళాక్షేత్రలో వైస్ ప్రిన్సిపాల్‌గా చేరాడు.

ఇతడు కర్ణాటక గాత్ర విద్వాంసునిగానే కాక నృత్యరూపకాలకు సంగీత స్వరకర్తగా కూడా పేరుపొందాడు. ఇతడు నట్టువాంగంలో నైపుణ్యం సాధించాడు. ఇతడు కళాక్షేత్రలో నృత్యంతో మమేకమై పోయాడు. భరతనాట్యం కూడా అభ్యసించడం మూలాన సంగీత నృత్యరూపకాలకు సంగీత దర్శకుడిగా ఇతడు రాణించాడు. కళాక్షేత్ర నిర్మించిన "పాంచాలీ శపథం", వి.పి.ధనంజయన్ రూపొందించిన "తిరుక్కురల్ భారతం" వంటి నృత్యరూపకాలు ఇతడు స్వరపరచిన వాటిలో కొన్ని.

ఇతడు అన్నమాచార్య కీర్తనలను కూడా స్వరపరిచి జనబాహుళ్యంలోనికి తెచ్చాడు. ఇతడు వందే వాసుదేవం అనే ఆడియో కేసెట్‌ను విడుదల చేశాడు. దానిలో మైసూరు వాసుదేవాచార్య స్వరపరిచిన కీర్తనలతో పాటు కొన్ని అన్నమాచార్య కీర్తనలను కూడా ఇతడు పాడాడు.

పురస్కారాలు

ఇతడిని దక్షిణ భారతదేశంలోని అనేక సంస్థలు సన్మానించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇతడిని ఆస్థాన విద్వాంసునిగా నియమించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ కర్ణాటక సంగీతంలో ఇతడు చేసిన కృషికి గుర్తింపుగా 2005లో అవార్డును ప్రదానం చేసింది. మద్రాసు సంగీత అకాడమీ ఇతడిని సంగీత కళాచార్య బిరుదుతో సత్కరించింది. భారత కళాంజలి సంస్థ ఇతడికి "సంగీత కళాభాస్కర" బిరుదును ఇచ్చింది.

మరణం

ఇతడు తన 88వ యేట 2019, ఫిబ్రవరి 26న చెన్నైలో మరణించాడు.

మూలాలు

The contents of this page are sourced from Wikipedia article on 19 Sep 2023. The contents are available under the CC BY-SA 4.0 license.