Biography
Lists
Also Viewed
Quick Facts
Biography
సి.కె.బాలగోపాలన్ భరతనాట్య కళాకారుడు, నాట్యాచార్యుడు.
విశేషాలు
ఇతడు 1939, సెప్టెంబర్ 4వ తేదీన కేరళ రాష్ట్రం, ఉత్తర మలబార్ జిల్లా, చెరువత్తూర్ గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి పి.కొమన్ నాయర్ ఎలిమెంటరీ స్కూలు ఉపాధ్యాయుడు. అతడు నాటకాలలో హాస్యపాత్రలను ధరించేవాడు. అతడిని "మలబార్ చార్లీ చాప్లిన్" అని పిలిచేవారు. బాలగోపాలన్ తన 14 యేళ్ళ వయసులో 1953లో మద్రాసులోని కళాక్షేత్రలో అడుగుపెట్టాడు. ఇతడు భరతనాట్యాన్ని రుక్మిణీదేవి అరండేల్ వద్ద, కథాకళి నృత్యాన్ని టి.కె.చందు పణికర్ వద్ద నేర్చుకుని నాట్యంలో డిప్లొమా పొందాడు. ఇతడు కళాక్షేత్రలో రుక్మిణీదేవికి సహాయకుడిగా కొనసాగి 2000లో భరతనాట్యం ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశాడు.
ఇతడు కళాక్షేత్ర ప్రదర్శించిన నృత్యరూపకాలలో దాదాపు అన్నింటిలో నటించాడు. వాటిలో చెప్పుకో తగినవి "గీత గోవిందం"లో కృష్ణుడు, "పాదుకా పట్టాభిషేకం"లో భరతుడు, "అభిజ్ఞాన శాకుంతలం"లో విదూషకుడు, "సీతాపహరణం"లో 'కపట సన్యాసి ' (రావణ), రామాయణం సిరీస్‌లో హనుమంతుడు, "పాంచాలీ శపథం"లో శకుని, "సీతా స్వయంవరం"లో లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, "కన్నప్పర్ కురవంజి"లో కన్నప్ప మొదలైనవి.
కళాక్షేత్రలో ఇతడు నాట్యాచార్యుడిగా అనేక మందికి భరతనాట్యం నేర్పించాడు.
ఇతనికి భారత ప్రభుత్వం కథాకళి నేర్చుకోవడానికి మూడు సంవత్సరాలు ఉపకార వేతనం ఇచ్చింది. 2003లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతనికి సంగీత నాటక అకాడమీ అవార్డును ఇచ్చింది.
ఇతడు 2019, ఆగష్టు 24వ తేదీన చెన్నైలో తన 79వ యేట మరణించాడు. ఇతని జీవిత చరిత్రను ఇతని శిష్యురాలు ఎలీజా లూయీస్ "లీప్ ఆఫ్ ఫెయిత్" పేరుతో రచించింది.